72 ఏళ్ల వయసులో తల్లయింది!

11 May, 2016 12:51 IST|Sakshi
72 ఏళ్ల వయసులో తల్లయింది!

అమృత్ సర్: పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన వృద్ధ దంపతుల కలలు 46 ఏళ్ల తర్వాత పండాయి. ఎందుకంటే పండంటి బిడ్డకు ఆ తల్లి ఏడు పదుల వయసులో జన్మనిచ్చింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి... దల్జీందర్ కౌర్(72), మోహిందర్ సింగ్ గిల్(79) లు భార్యాభర్తలు. 46 ఏళ్ల కిందట వీరికి వివాహమైంది. మిగతా ఆడవాళ్లలా తాను తల్లిని కాలేకపోయానని ఎన్నో రోజులు కాదు.. సంవత్సరాలు వేదన చెందింది. కానీ, ఆమెకు మాత్రం కచ్చితంగా నమ్మకం ఉంది. తాను తల్లిని అవుతానని, చివరికి పండంటి బిడ్డకు జన్మనిచ్చి పరిపూర్ణ మహిళగా మారిపోయానంటూ ఆనందభాష్పాలతో దల్జీందర్ కౌర్ చెప్పింది.

అసలే వివాహం అయి 46 ఏళ్లు అవుతుంది. మోనోపాస్ దశ దాటి రెండు దశాబ్దాలు కూడా గడచిపోయాయి. అలాంటి స్థితిలో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్(ఐవీఎఫ్ - టెస్ట్ ట్యూబ్) గురించి విన్నారు. ఇందుకు తమ స్వస్థలం పంజాబ్, అమృత్ సర్ నుంచి హర్యానా లోని హిస్సార్ కు తరచు వెళ్లివచ్చేవారు. 2013 నుంచి హిస్సార్ లోనే ఉన్నామని తండ్రి అయిన మోహిందర్ సింగ్ చెప్పారు. గతంలో 70 ఏళ్ల వయసులో ఓ మహిళ తల్లి అయింది..  దల్జీందర్ కౌర్(72) మాత్రం అత్యధిక వయసులో తల్లి అయి గత రికార్డును తిరగరాశారు.
 
2013లో పేపర్ ప్రకటన చూసి ఆమె ఒంటరిగానే తమను సంప్రదించిందని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుడు, డాక్టర్ అనురాగ్ బిస్నోయ్ తెలిపారు. గర్భాశయం బయట అండాన్ని ఫలదీకరణం చెందించి తల్లి కావాలన్న ఆమె జీవిత కాల కోరికను తీర్చారు. రెండు సార్లు ఐవీఎఫ్ టెస్టులు ఫెయిలయ్యాను. చివరికి గతేడాది జూలైలో సంతోషకర వార్త విన్నారు. గత ఏప్రిల్ 19న పండంటి బిడ్డకు ఆమె జన్మనివ్వడంతో ఆ వృద్ధ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆర్మాన్ సింగ్ అనే పేరు పెట్టినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు