జాన్ బీ, జహాన్ బీ రెండూ ముఖ్యం: ప్రధాని మోదీ

11 Apr, 2020 17:39 IST|Sakshi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగింపుపై  ఉత్కంఠ కొనసాగుతుండగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు  చేశారు. కోవిడ్ -19 ప్రభావం, పరిణమాలపై 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  దేశ ప్రజలప్రాణాలను, ఆర్థిక వ్యవస్థను రక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. దేశ ఉజ్జ్వల భవిష్యత్తు దృష్ట్యా, ఆరోగ్యవంతమైన భారతం కోసం ప్రజల జీవితంతో పాటు దేశమూ ముఖ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యల ప్రభావాన్ని నిర్ణయించడానికి తదుపరి 3-4 వారాలు  చాలా కీలకమని  పేర్కొన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ తమ ప్రభుత్వం దష్టి ‘జాన్‌ హైతో జహాన్‌ హై’ నుంచి  ‘జాన్‌ బీ ఔర్‌ జహాన్‌ బీ’ పైకి దృష్టి మళ్లిందని ప్రకటించడం ప్రధానంగా పలువురి దష్టిని ఆకర్షించింది. ‘ప్రాణముంటే ప్రగతి అదే ఉంటుంది’ నుంచి ‘ప్రాణం ఉండాలి. ప్రగతీ ఉండాలి’ అన్నది ఆయన ప్రాస వ్యాక్యానికి అర్థం. 

‘మనం ఉంటేనే ప్రపంచం... అన్నది నిన్నటి మంత్ర,  మనము ఉండాలి, ప్రపంచం ఉండాలి... అనేది నేటి మంత్ర. ఇప్పటిదాకా తీసుకున్న చర్యల సత్ఫలితాలు కనిపించాలంటే, మరో మూడు నాలుగు వారాలు చాలా ముఖ్యం. వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారుడికి అందేలా మార్కెటింగ్ చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. ఆరోగ్య సేతు యాప్ ఇకనుంచి ట్రావెల్ ఈ పాస్ లాగా ఉపయోగపడుతుంది. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది  పైన దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేశంలో సరిపోయినన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి’ అని ప్రధాని స్పష్టం చేశారు.

అయితే సీఎంలతో ప్రధాని నరేంద్రమోదీ టెలి కాన్ఫరెన్స్ తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ గందరగోళాన్ని రేపింది. లాక్ డౌన్ పొడిగింపుపై సరైన నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించడం గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారని అటు మమతా బెనర్జీ కూడా వెల్లడించారు. అయితే ఈ ప్రకటనను ఖండించిన కేంద్రం... ప్రధాని ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రసంగం కూడా వాయిదా పడిందని, సోమవారం మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని సమాచారం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు