కమలనాథులకు కొత్త దళపతి

21 Jan, 2020 03:52 IST|Sakshi
జేపీ నడ్డాకు అభినందనలు తెలుపుతున్న ప్రధాని మోదీ, పక్కన అడ్వాణీ, అమిత్‌షా

బీజేపీ 11వ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక

అభినందించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, ఇతర సీనియర్‌ నేతలు

మరిన్ని రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యమన్న నూతన అధ్యక్షుడు

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడిగా జగత్‌ ప్రకాశ్‌ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా బీజేపీ 11వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని సోమవారం పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జ్‌ రాధామోహన్‌ సింగ్‌ ప్రకటించారు. నూతన అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి, పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్న అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇతర సీనియర్‌ నేతలు అభినందనలు తెలిపారు. ఐదున్నర ఏళ్ల పాటు పార్టీని విజయవంతంగా నడిపి, పలు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో నిలిపిన అమిత్‌ షా స్థానంలో నడ్డా పార్టీ పగ్గాలు చేపట్టారు.

హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన నడ్డాకు హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండే నేతగా పేరుంది. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ సైద్ధాంతిక దిక్సూచి ఆరెస్సెస్, ప్రధాని మోదీ, అమిత్‌ షా సమర్ధించారు. ఈ సంస్థాగత ఎన్నికలో నడ్డా తరఫున మాత్రమే నామినేషన్లు దాఖలు కావడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయంగానే ముగిసింది. నడ్డా తరఫున కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ, పలువురు రాష్ట్ర శాఖల ప్రతినిధులు నామినేషన్లు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని అందించడం కొత్త అధ్యక్షుడిగా నడ్డా ముందున్న తక్షణ సవాలు. ఇప్పటివరకు విజయం సాధించని రాష్ట్రాల్లో బీజేపీకి అధికారాన్ని సాధించిపెట్టడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని నడ్డా పేర్కొన్నారు.  

ఎన్నిక అనంతరం నడ్డా అభినందన కార్యక్రమం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి షా, పార్టీ అగ్ర నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఇతర సీనియర్‌ నాయకులు హాజరయ్యారు. మోదీ కొత్త ప్రభుత్వంలో హోంమంత్రిగా అమిత్‌ షా చేరడంతో.. గత జూన్‌లోనే బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డా ఎన్నికయ్యారు. అమిత్‌ షా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉండటం వల్ల.. ఒక వ్యక్తికి ఒకే పదవి అని బీజేపీలో ఉన్న సంప్రదాయం నేపథ్యంలో నడ్డా నాడు కార్యనిర్వాహక అధ్యక్షుడు అయ్యారు.

పార్టీ అధ్యక్షుడిగా నడ్డా ఎన్నికవడంపై అమిత్‌ షా హర్షం వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షుడి హయాంలో, మోదీ మార్గనిర్దేశంలో బీజేపీ కొత్త శిఖరాలకు చేరుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘నడ్డా నేతృత్వంలో పార్టీ మరింత వైభవాన్ని, మరిన్ని విజయాలను సాధించాలి’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆకాంక్షించారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పార్టీ అధ్యక్షుడి స్థాయికి నడ్డా ఎదగడం బీజేపీ కార్యకర్తల పార్టీ అనే విషయాన్ని స్పష్టం చేస్తోందని మరోమంత్రి గడ్కరీ పేర్కొన్నారు.

ఇది బీజేపీలోనే సాధ్యం
ఒక సాధారణ కార్యకర్త పార్టీ అధ్యక్షుడు కావడం కేవలం బీజేపీలోనే సాధ్యమని కొత్త అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ‘దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ బీజేపీనే. అయితే, మనం ఇక్కడే ఆగిపోం. కొన్ని రాష్ట్రాలు మిగిలాయి. మన దృష్టి ఇకపై వాటిపైననే. త్వరలో వాటినీ సాధిస్తాం’ అన్నారు.

కలిసి స్కూటర్‌పై తిరిగాం
నడ్డా అభినందన కార్యక్రమంలో ప్రధాని మోదీ.. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. నడ్డా, తాను పాత స్నేహితులమని, పార్టీ కార్యక్రమాల్లో భాగంగా తాము కలిసి స్కూటర్‌పై తిరిగేవారమని చెప్పారు. నడ్డా హయాంలో పార్టీకి కొత్త శక్తి, ఆశ, ఆకాంక్షలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యక్షుడికి అందరం పూర్తి సహకారం అందించాలన్నారు. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగుతున్న అమిత్‌ షా నిరుపమాన కార్యకర్త అని ప్రశంసించారు. మరోవైపు, ఇదే వేదికపై నుంచి మోదీ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వారు కొత్త ఆయుధాలను పట్టుకు తిరుగుతున్నారని ఆరోపించారు. అబద్ధాలను, గందరగోళాన్ని వ్యాప్తి చేయడమే వారు పనిగా పెట్టుకున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలను ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోవాలని, అదే బీజేపీ బలమని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 

మరిన్ని వార్తలు