‘జై శ్రీరామ్’ బెంగాల్ సంస్కృతిలో లేదు: అమర్త్యసేన్

6 Jul, 2019 11:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘బెంగాలీల జీవితాల్లో, సంస్కృతుల్లో భాగం దుర్గా మాతా, 'జై శ్రీరామ్' నినాదం ఇటీవల దిగుమతి చేసుకున్న నినాదమే కానీ బెంగాల్ సంస్కృతితో ఎటువంటి సంబంధం లేదని’ నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త అమర్త్యసేన్ వ్యాఖ్యానించారు. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో ప్రజలను కొట్టడానికి ఒక సాకుగా మాత్రమే జై శ్రీరామ్ నినాదం ఉపయోగిస్తున్నారు. నేను ఇంతకు ముందు జై శ్రీరామ్ నినాదం వినలేదు. దీనికి బెంగాలీ సంస్కృతితో సంబంధం లేదని భావిస్తున్నాను. గతంలో బెంగాల్‌లో రామనవమి వేడుకలు నిర్వహించడం వినలేదని, ఇప్పుడు  రామ నవమిని కోల్‌కతాలో ఎక్కువగా జరుపుకుంటున్నారు’ అని అన్నారు.

‘నీకు ఇష్టమైన దేవత ఎవరు అని నా నాలుగేళ్ల మనవరాలిని అడిగాను. అప్పుడు ఆమె మా దుర్గా అని బదులిచ్చింది. దుర్గ దేవి మా జీవితంలో సర్వవ్యాప్తి’ అని ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్ససేన్‌ అన్నారు. కాగా గత గురువారం మమతా బెనర్జీ 623 సంవత్సరాల నాటి రథయాత్రను ప్రారంభించడానికి హుగ్లీ జిల్లాలోని మహేష్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు బీజేపీ మద్దతుదారులు ‘జై శ్రీరామ్’ నినాదాలతో స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో బెంగాల్‌లో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయడంపై తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య అనేక గొడవలు జరిగాయి. మే నెలలో  ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ‘జై శ్రీ రామ్’ నినాదాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.

మరిన్ని వార్తలు