విమానయానానికి జై

13 Dec, 2015 03:04 IST|Sakshi
విమానయానానికి జై

రెక్కలు విచ్చుకుంటున్న మధ్యతరగతి
♦ దేశ, విదేశీ ప్రయాణాలకు మొగ్గు
♦ ఆకట్టుకునే ఆఫర్లతో ఊరిస్తున్న విమాన సంస్థలు
♦ గణనీయంగా పెరుగుతున్న ఫ్లైట్ జర్నీలు..
♦ ఆర్నెల్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 20 శాతం పెరుగుదల
♦ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న హైదరాబాద్ విమానాశ్రయం
♦ ప్రయాణికుల్లో ‘కోటి’ మార్కు దాటిన జీఎమ్మార్
♦ తిరుపతి, విజయవాడ, విశాఖకు రెట్టింపైన రాకపోకలు
 
 విహారయాత్ర.. ఒకప్పుడు ఖరీదైన వ్యవహారం! కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది.దేశీ, విదేశీ యాత్రలకు మధ్య తరగతి జనం కూడా జై కొట్టేస్తున్నారు! తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్ని చుట్టేసేందుకు ఫ్లైట్ జర్నీని ఎంచుకుంటున్నారు. డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఉద్యోగులకు వేల రూపాయల జీతాలు, సులువుగా అప్పులిచ్చే బ్యాంకులు అందుబాటులో ఉండటంతో మధ్యతరగతి విమాన ప్రయాణాలు పెరిగిపోయాయి. విమానయాన సంస్థలూ బంపర్ ఆఫర్లతో వారిని ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖ, గోవాలతో పాటు అమెరికా, బ్రిటన్, దుబాయ్, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్ దేశాలకు సర్వీసులను రెట్టింపు చేశాయి.      
 
 సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణ, ఏపీల్లో ప్రయాణాలకు విమానయానం ఎంచుకుంటున్న వారి సంఖ్య గత ఆర్నెల్లలో 20 శాతం పెరిగింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర కాస్మోపాలిటన్ నగరాల్లో విమానయానాల సగటు 7.3 శాతం వృద్ధి మాత్రమే ఉండగా.. తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశ, విదేశాలను చుట్టి వస్తున్నారు. గడిచిన ఆర్నెల్లలో దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల్లో దక్షిణాదిన కొచ్చి (35.4 శాతం) తర్వాత అత్యధిక వృద్ధి రేటు హైదరాబాద్ విమానాశ్రయంలోనే (15.4 శాతం) నమోదైంది. తాజాగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన లెక్కల మేరకు దేశీయ ప్రయాణాల్లో 27.5 శాతంతో బెంగళూరు, 21.1 శాతంతో కొచ్చి, 20.4 శాతంతో హైదరాబాద్  మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

 ఆఫర్ల మీద ఆఫర్లు..
 విమానయాన సంస్థలు వివిధ ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. తొంభై రోజుల ముందు రూ.2,001 చెల్లించి టికెట్ బుక్ చేసుకుంటే దేశంలో ఎక్కడికైనా విమానయానం చేయొ చ్చంటూ స్పైస్ జెట్ ఊరిస్తుంటే.. ‘‘మీ సెలవులను దుబాయ్‌లో ఎంజాయ్ చెయ్యండి.. హాలిడే సేవింగ్స్ అకౌంట్‌తో నెలకు కేవలం రూ.3,600 చెల్లిస్తే 8.25 శాతం వడ్డీ జత చేస్తాం. ఆ సొమ్ముతో దుబాయ్‌లో ఐదు రోజులు గడపవచ్చు. వచ్చే జనవరి ప్రయాణాలను ఇప్పుడే బుక్ చేస్తే 20 శాతం రాయితీ’ అంటూ ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ‘థామస్ కుక్ ఆఫర్ ఇచ్చింది. మరోవైపు అనేక ప్రైవేటు కంపెనీలు మొదలుకుని ప్రభుత్వ రంగ సంస్థలూ టార్గెట్లు దాటిన ఉద్యోగులకు ఫారెన్ ట్రిప్‌ను అందజేస్తున్నాయి.

 ‘కోటి’ దాటేసిన జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు
 కోటి ప్రయాణికుల మార్క్‌ను జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్ దాటేసింది. 2014-15 వార్షిక సంవత్సరంలో ఈ మార్కును అధిగమించింది. మధ్యతరగతి కుటుంబాలు, ప్రైవేటు కంపెనీల ఉద్యోగుల టూర్ ప్యాకేజీలతోపాటు ఉపాధి కోసం దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు, అమెరికా, బ్రిటన్ యూనివర్సిటీల్లో చదువుల కోసం వెళ్లే విద్యార్థులు దేశంలో తెలంగాణ, ఏపీ నుంచే అత్యధికంగా ఉన్నారు. దీంతో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. ప్రస్తుతం ఏటా 1.20 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం కలిగిన ఈ ఎయిర్‌పోర్ట్‌ను త్వరలో.. 2 కోట్ల ప్రయాణికులకు అనుగుణంగా విస్తరించనున్నారు.

 హైదరాబాద్ వైపు.. పక్క రాష్ట్రాల చూపు
 ప్రయాణికుల వృద్ధిలో హైదరాబాద్ ముందంజలో ఉండటంతో విమానయాన సంస్థలు తమ సర్వీసులను అమాంతం పెంచేశాయి. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ నుంచి 20 దేశాలకు, దేశంలో 35 ప్రధాన కేంద్రాలకు నేరుగా విమాన సర్వీసులు అందు బాటులోకి వచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు మొదలుకుని సమీపంలోని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రయాణికులు హైదరాబాద్ వైపు చూస్తున్నారు.

 తిరుపతి, విశాఖ, విజయవాడకు రద్దీ
 గతంతో పోలిస్తే తిరుపతి, విజయవాడ, విశాఖలకు ఫ్లైట్ జర్నీలు రెట్టింపు అయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి 2014 తొలి ఆర్నెళ్లలో 1,11,169 మంది వెళ్లగా.. ఈ ఏడాది తొలి ఆర్నెల్లలో 1,70,869 మంది వెళ్లారు. విజయవాడ-హైదరాబాద్ మధ్య 2014 తొలి ఆర్నెల్లలో 93,338 మంది రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది 1,85,246 మంది (98 శాతం వృద్ధి) పెరిగారు. విశాఖ-హైదరాబాద్ మధ్య గతేడాది 5,30,546 మంది వెళ్లగా.. ఈ ఏడాది 7,57,183 మంది రాకపోకలు (42 శాతం వృద్ధి) సాగించారు. రద్దీకి తగ్గట్టు విమాన సంస్థలూ తమ సర్వీసులను రెట్టింపు చేశాయి.
 
 అందరికీ అందుబాటులో చార్జీలు
 విమాన చార్జీలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్ బుకింగ్‌తోపాటు వివిధ దేశాలు, పర్యాటక ప్రదేశాలపై నెట్‌లో సమాచారం దొరుకుతోంది. పెరిగిన ఉపాధి అవకాశాలు, ఆదాయాలు విహార యాత్రల్ని ప్రోత్సహిస్తున్నాయి. నేను ఇటీవల మరో నలుగురు మిత్రులతో కలసి థాయ్‌లాండ్ వెళ్లాను. విమాన టికెట్లు, తిండి, బస సహా అన్నింటికీ రూ.40 వేలు-రూ.50 వేలు ఖర్చవుతుంది.   
 - సుకుమార్‌రెడ్డి, వ్యాపారవేత్త, హైదరాబాద్
 
 టూర్‌కు మించిన అనుభూతి లేదు
 నేను అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు చూశాను. సింగపూర్ మహిళలకు చాలా సేఫ్ కంట్రీ. అర్ధరాత్రి కూడా ఒంటరిగా తిరగవచ్చు. మన దేశంలో గోవా, కేరళ నాకు ఫేవరేట్. అలెప్పి బ్యాక్ వాటర్స్, గోవా బీచ్‌లు అద్బుతం. టూర్ చేయడానికి  మించిన అనుభూతి లేదు. ప్రతి ఒక్కరూ కొత్త ప్రాంతాలను చూసి అనుభూతులు మూటగట్టుకోవాలి.
 - అర్పిత, గృహిణి, హైదరాబాద్

మరిన్ని వార్తలు