డాక్టర్‌పై చేయిచేసుకుంటే పదేళ్ల జైలు!

14 Aug, 2019 08:53 IST|Sakshi
ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌

న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న వైద్యులు, ఆరోగ్య నిపుణులపై దాడి చేసే వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడేందుకు వీలు కల్పించే ముసాయిదా బిల్లును రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌ తెలిపారు. వైద్యులు, వైద్యసేవా నిపుణులను తీవ్రంగా గాయపరిచిన వారికి మూడు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా, అదేవిధంగా, ఆస్పత్రిపై దాడి చేసి నష్టం కలిగించిన వారికి ఆరు నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.50వేల నుంచి 5లక్షల వరకు జరిమానా విధించేలా నిబంధనలను పొందుపరిచామన్నారు.

త్వరలోనే దీనిపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నామన్నారు. దీని తర్వాత బిల్లును కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళుతుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో వైద్యులపై దాడికి నిరసనగా జూన్‌లో దేశవ్యా​ప్తంగా డాక్టర్లు ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు