పరీకర్‌.. మోదీని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారా ఏంటి?!

21 Dec, 2018 20:06 IST|Sakshi

పనాజి : తాను పదవిలో కొనసాగడం కోసం గోవా సీఎం మనోహర్‌ పరీకర్‌ ప్రధాని నరేంద్ర మోదీ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారేమో అంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పరీకర్‌ అనారోగ్యం కారణంగా గోవా అభివృద్ధి కుంటుపడిందని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‘జన్‌ఆక్రోష్‌’ పేరిట ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నాటి ర్యాలీలో జైపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నైతికత గురించి మాట్లాడే మనోహర్‌ పరీకర్‌  స్వప్రయోజనాల కోసం సీఎం కుర్చీని జలగలా పట్టుకున్నారని విమర్శించారు. ‘ నాకు తెలిసి ఆయన తన సీటు కోసం ప్రధాని మోదీని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారేమో? ఇందుకోసం రఫేల్‌ డీల్‌ అంశాన్ని ఉపయోగించుకుంటున్నారేమో’ అంటూ జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందిన పరీకర్‌ అక్టోబర్‌లో డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఆయన ఆదివారం తొలిసారిగా ప్రజల మధ్యకు వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధికార పార్టీ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టింది. రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన పరీకర్‌ ఆ సమయంలో తాను తెలుసుకున్న విషయాల ఆధారంగా మోదీజీని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

మరిన్ని వార్తలు