అక్కడ ప్రతిరోజూ జనగణమన

31 Oct, 2017 11:23 IST|Sakshi

జైపూర్‌ :  జాతీయగీతం జనగణమనపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న దశలో జైపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అపూర్వమైన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మున్సిపల్‌ ప్రధాన కార్యాలయం ముందు ప్రతి రోజూ జనగణమణ, వందేమాతరం గీతాలను ఆలపించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సినిమా హాల్స్‌, బహిరంగ ప్రదేశాల్లో జాతీయ గీతాలాపనపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన వారం రోజులు తరువాత ఇక్కడి అధికారులు ఇటువంటి అనూహ్య నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మంగళవారం నుంచి జైపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రతి రోజూ ఉదయం 9:50 గంటలకు జాతీయ గీతం జనగణమన, సాయంత్రం 5:55 గంటలకు జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం 9:50 గంటలకు అధికారులంతా నిలబడి జనగణమన ఆలపించారు.

జాతీయ గీతాలాపనపై జైపూర్‌ మేయర్‌ అశోక్‌ లాహోటి మాట్లాడుతూ.. జనగణమన ఆలపనతో పని ప్రారంభించడం వల్ల ఉత్తేజంతో పనిచేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు