నోట్ల రద్దుపై ఆర్‌బీఐ అభ్యంతరాలు

12 Mar, 2019 04:09 IST|Sakshi

నోట్ల రద్దుకు ముందు ఆర్‌బీఐ సమావేశం

మినిట్స్‌ విడుదల చేసిన జైరాం రమేశ్‌

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టొచ్చన్న కేంద్ర ప్రభుత్వ వాదనపై ఆర్‌బీఐ అభ్యంతరం వ్యక్తం చేసిందని కాంగ్రెస్‌ పేర్కొంది. పెద్ద నోట్ల రద్దును ప్రకటించడానికి ముందు అంటే 2016 నవంబర్‌ 8న సాయంత్రం 5.30 నిమిషాలకు ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశానికి సంబంధించిన (మినిట్స్‌) వివరాలను సోమవారం కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైరాం రమేశ్‌ మీడియాకు విడుదల చేశారు.  ‘నల్లధనం చాలా వరకు కరెన్సీ రూపంలో లేదు. రియల్‌ రంగంలోని ఆస్తులు, బంగారం రూపంలో ఉన్నాయి.

నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు’అని ఆర్‌బీఐ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశంలో పేర్కొన్నట్లు రమేశ్‌ తెలిపారు. ‘ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల మాత్రమే అసలైన పెరుగుదల. అంతేకానీ చెలామణి అవుతున్న కరెన్సీ పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభావం చూపదు. నల్ల ధనం తగ్గుతుందన్న వాదన నోట్ల రద్దు నిర్ణయాన్ని పెద్దగా సమర్థించదు’అని ఆర్‌బీఐ వ్యాఖ్యలను ఉటంకించారు. దేశంలో చెలామణీ అవుతున్న మొత్తం కరెన్సీలో నకిలీ నోట్లు కేవలం రూ.400 కోట్లు ఉంటుందని, అది చాలా తక్కువ ప్రాముఖ్యం ఉన్న విషయమని ఆర్‌బీఐ తెలిపినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు