'జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు'

3 Aug, 2016 11:28 IST|Sakshi
'జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు'

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక సంఘం అనేక సిఫార్సులు చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ జైరాం రమేష్ తెలిపారు. వాటిని అంగీకరించాలా? లేదా ? అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కె.వి.పి.రామచంద్రరావు నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి హాజరైన జైరాం రమేష్ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయాలు, పంపకాలపైనే అధికంగా ఆర్థిక సంఘం సిఫార్సులు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. సహజంగానే కొన్ని రాష్ట్రాలు వీటిని అంగీకరిస్తాయని చెప్పారు. కానీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని జైరాం రమేష్ ఆరోపించారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఆర్థిక సంఘం రద్దు చేయలేదన్నారు. అందుకు సంబంధించిన మేయిల్ను జైరాం రమేష్ బయటపెట్టారు. అలాగే 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రద్దుకు సంబంధించి ఎలాంటి సిఫార్సు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఆ ఆర్థిక సంఘంలోని కీలక సభ్యుడు అభిజిత్ సేన్ నిన్ననే తనకు ఈ మెయిల్ చేశారని చెప్పారు.

రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల ఆదాయాన్ని 32 శాతం నుంచి 42 శాతానికి మాత్రమే పెంచిందని తెలిపారు. అందులో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, లేని రాష్ట్రాలు అంటూ ఏమీ విడదీయలేదని వెల్లడించారు. అన్నింటికీ అదే సూత్రాన్ని వర్తింప చేసిందన్నారు. కానీ, ప్రత్యేక హోదా అంశం రద్దుకు ఎలాంటి సిఫార్సు చేయలేదన్నారు. కానీ ఆర్థిక మంత్రి సభనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు.

ప్రత్యేక హోదా ఇవ్వాలా? లేదా? అన్నది మోదీ ప్రభత్వం ఇష్టం అని చెప్పారు. కానీ 14వ ఆర్థిక సంఘం మీద నెడుతూ... అబద్దాలు చెప్తున్నారని బీజేపీ నేతలను విమర్శించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం తనకు తానుగానే ప్రత్యేక హోదాను రద్దు చేసిందన్నారు. దేశంలో మొత్తం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని జైరాం రమేష్ గుర్తు చేశారు. వాటిలో ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందన్నారు.

ప్రత్యేక హోదా రద్దు అన్నది రాజకీయంతో తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీల మధ్య సంబంధాలు నామమాత్రమైనవి కావని... ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉందని గుర్తు చేశారు. ఏపీ పునర్ విభజన చట్టంలో హామీలు అమలు చేయడంలో మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. తిరుపతి ఐఐటీ ప్రారంభానికి , తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ మొదలుపెట్టడానికి రెండేళ్ల సమయం తీసుకున్నారన్నారు. ప్రత్యేక హోదాకు ఆర్థిక సంఘానికి సంబంధమే లేదని.. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రమే అని జైరాం రమేష్ స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు