జైషే బరితెగింపు: ఆరు రాష్ట్రాలకు ఉగ్రముప్పు?

16 Sep, 2019 08:36 IST|Sakshi

చండీగఢ్‌ : దేశమంతా దసరా ఉత్సవాల్లో మునిగిపోయిన వేళ నరమేధం సృష్టించేందుకు సిద్ధమైనట్లు ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌ ప్రకటన విడుదల చేసింది. మసూద్‌ అహ్మద్‌ అనే పేరిట రాసిన లేఖలో.... దసరా సందర్భంగా ఆరు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడనున్నట్లు పేర్కొంది. సదరు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లతో పాటు జన సమ్మర్థంతో ఉండే ఆలయాల్లో కూడా బాంబు దాడులకు తెగబడతామని తెలిపింది. అక్టోబర్‌ 8న హర్యానాలోని రోహతక్‌ రైల్వే స్టేషనుతో పాటు... ముంబై సిటీ, బెంగళూరు, చెన్నై, జైపూర్‌, భోపాల్‌, కోటా, ఇటార్సీ రైల్వే స్టేషన్లను పేల్చివేస్తామని జైషే లేఖలో హెచ్చరించింది. అదే విధంగా రాజస్తాన్‌, జైపూర్‌, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానాలోని పలు ఆలయాల్లో కూడా పేలుళ్లకు పాల్పడతామని పేర్కొంది.

ఈ మేరకు జైషే రాసిన లేఖ... రోహతక్‌ రైల్వే జంక్షన్‌ సూపరిండెంటెండ్‌ కార్యాలయానికి శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోస్టు ద్వారా చేరుకుంది. పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి మసూద్‌ అహ్మద్‌ పేరిట వచ్చిన ఈ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లేఖలో పేర్కొన్న ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక పదే పదే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌  సైనికులకు భారత సైన్యం తగిన రీతిలో జవాబిస్తున్నా వారి వైఖరి మాత్రం మారడం లేదు. భారత్‌లో సంప్రదాయ యుద్ధం జరిగితే ఓడిపోతామని అంగీకరించిన పాక్‌...ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారత్‌ను దొంగ దెబ్బ తీసేందుకు ఉగ్రవాదుల సహాయం తీసుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

>
మరిన్ని వార్తలు