ఉగ్ర మారణహోమం

15 Feb, 2019 04:14 IST|Sakshi
సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగిన తీరును చూపుతున్న ఊహా చిత్రం

43 మంది జవాన్ల వీర మరణం, 20 మందికి తీవ్రగాయాలు

350కిలోల బరువైన పేలుడు పదార్థాల కారుతో ఆత్మాహుతి దాడి

దాడికి బాధ్యత ప్రకటించుకున్న పాక్‌ ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్‌

ఆదిల్‌ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు

2001 తర్వాత భారీ దాడి ఇదే

శ్రీనగర్‌/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను శ్రీనగర్‌లోని 92 బేస్‌ బదామీగఢ్‌ ఆర్మీ కంటోన్మెంట్‌ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈ దాడిలో గాయపడ్డ జవాన్లలో చాలామంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనీ, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌ ప్రకటించుకుంది. తమ కమాండర్‌ ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ అలియాస్‌ వకాస్‌ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సహా పలువురు నేతలు ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు.
 
విధుల్లో మళ్లీ చేరేందుకు వెళుతుండగా..

మళ్లీ విధుల్లో చేరేందుకు 2,547 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు దాదాపు 78 వాహనాల్లో గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరారు. వీరి వాహనాలు సూర్యాస్తమయంలోగా 266 కిలోమీటర్ల దూరంలోని శ్రీనగర్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఉండే శ్రీనగర్‌–జమ్మూ జాతీయ రహదారిపై భద్రతాబలగాల వాహనాలు ఒకదానివెంట మరొకటి వెళుతున్నాయి. రెప్పపాటులో ఉగ్రవాది కారుతో బస్సును ఢీకొట్టాడు. భద్రతాబలగాలు తేరుకునేలోపే తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో కాన్వాయ్‌లో ఆత్మాహుతి కారు ఢీకొన్న బస్సు తుక్కుతుక్కుకావడంతో పాటు జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి.  పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది.  

ఘటనా స్థలానికి ఎన్‌ఐఏ
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు చెందిన ఫోరెన్సిక్‌ నిపుణులు, ఎన్‌ఎస్‌జీకి చెందిన పేలుడు పదార్థాల నిపుణులు ఘటనాస్థలికి చేరుకుని సాక్ష్యాలు, పేలుడు అవశేషాలను సేకరించారు. ఉగ్రదాడి జరగడంతో శ్రీనగర్‌–జమ్మూ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బిహార్‌ పర్యటను రద్దుచేసుకుని వెనుదిరగగా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబా భూటాన్‌ పర్యటన నుంచి అర్ధంతరంగా తిరుగుప్రయాణమయ్యారు. 2016, సెప్టెంబర్‌ 18న కశ్మీర్‌లో ఉడీ ఆర్మీ బేస్‌పై ఉగ్రదాడి తర్వాత భద్రతాబలగాలు భారీస్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. ఉడీ ఘటనలో 19 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

రోడ్డు మూసేయడంతో భారీ కాన్వాయ్‌
ప్రమాద విషయమై సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) ఆర్‌.ఆర్‌. భట్నాగర్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో వాతావరణం బాగోలేకపోవడంతో గత రెండ్రోజులగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ఉగ్రవాదుల ఆత్మాహుతిదాడికి గురైన బస్సులో 39 మంది సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. వీరంతా సీఆర్పీఎఫ్‌ 76వ బెటాలియన్‌కు చెందినవారని పేర్కొన్నారు. దాడి సందర్భంగా జవాన్ల వాహనాలపై కాల్పులు జరిగాయన్నారు. సాధారణంగా సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌లో వెయ్యి మంది జవాన్లు మాత్రమే ఉంటారనీ, కానీ గత రెండ్రోజులుగా రహదారి మూతపడటంతో ఒకేసారి భారీ సంఖ్యలో 2,547 మంది జవాన్లు శ్రీనగర్‌కు బయలుదేరారని తెలిపారు. ఈ ఘటనపైకశ్మీర్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఉగ్రదాడి తీవ్రత దృష్ట్యా కశ్మీర్‌ పోలీసులతోపాటు ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ బృందాలు ఈ విచారణలో పాలుపంచుకుంటారని భట్నాగర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో శాంతిభద్రతలను సమీక్షించేందుకు శుక్రవారం కేంద్ర భద్రత వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశం కానుంది.  

ఖండించిన అంతర్జాతీయ సమాజం
పుల్వామాలో భద్రతా బలగాలపై జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి, అమెరికా, రష్యాతోపాటు, ఫ్రాన్సు, జర్మనీ, ఆస్ట్రేలియా, టర్కీ, చెక్‌ రిపబ్లిక్, పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు ఖండించాయి. పుల్వామా దాడిని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి కారకులను గుర్తించి చట్టం ముందు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలతోపాటు భారత ప్రభుత్వం, భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

త్యాగాలు వృథా కావు
జమ్మూకశ్మీర్‌లో జవాన్లపై జరిగిన దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. మన భద్రతా బలగాల త్యాగాలు వృథా కావని ఆయన అన్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ దాడిలో వీరమరణం పొందినవారి కుటుంబాలకు జాతి మొత్తం మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన అనంతర పరిస్థితిపై హోం మంత్రి రాజ్‌నాథ్‌తోపాటు అధికారులతో చర్చించానన్నారు. ‘పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ బలగాలపై దాడి అత్యంత హేయం. పిరికిపందలు పాల్పడిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. సాహసవంతులైన మన భద్రతా బలగాలు చేసిన త్యాగాలు వృథా కావు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఉగ్రదాడి తరువాత మంటల్లో చిక్కుకున్న ఆర్మీ వాహనాలు.    


  సైనికుడి మృతదేహాన్ని తరలిస్తున్న తోటి సైనికులు 

ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది
 

ఎవరేమన్నారంటే..
ప్రతీకారం తీర్చుకుంటాం
పుల్వామా దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంటుందని హోం మంత్రి రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. హింసాత్మక చర్యల ద్వారా శాంతికి భగ్నం కలిగించాలనుకునే శక్తుల ఆటలను కట్టించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ‘సీఆర్పీఎఫ్‌ జవాన్లపై దాడికి జైషే మొహమ్మద్‌ సంస్థే కారణం. ఇందుకు తగినవిధంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నా.  దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్క జవానుకూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని అన్నారు.

- హోం మంత్రి రాజ్‌నాథ్‌

‘కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఉగ్ర మూకలపై జరిగే పోరాటంలో జాతి మొత్తం ఐక్యంగా నిలబడుతుంది. అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. క్షతగాత్రులైన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. దుష్ట, ఉగ్ర మూకలపై జరిగే పోరులో జాతి మొత్తం ఒక్కటిగా నిలబడుతుంది.     
    – రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
 
‘బలగాలపై ఉగ్రదాడిపై తీవ్ర వేదనకు గురయ్యా. పిరికిపందల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. అమర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. దేశ భద్రత విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజీ ధోరణి అవలంభిస్తోంది.
   – రాహుల్‌ గాంధీ

‘కశ్మీర్‌లో భారత్‌ బలగాలపై జరిగిన దాడిని అమెరికా దౌత్య కార్యాలయం ఖండిస్తోంది.  బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఉగ్రవాదాన్ని ఓడించడంలో భారత్‌ చేసే పోరాటానికి అమెరికా వెన్నంటి ఉంటుంది’
–అమెరికా రాయబారి కెన్నెత్‌ జెస్టర్‌


‘అవంతిపొరాలో 30 మంది జవాన్లు  అమరులయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ తీవ్రమైన ఉగ్రవాద చర్యను ఖండించడానికి ఏ పదాలూ సరిపోవు. ఈ మూర్ఖత్వపు చర్యలు ఆగిపోయేలోపు ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి?’
    –జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా
 

‘కశ్మీర్‌లో బలగాలపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నా. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం షాక్‌కు గురి చేసింది. ఇది యావత్‌ దేశానికే విషాద దుర్ఘటన. జవాన్ల కుటుంబాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
– ఏపీ సీఎం చంద్రబాబు

కేంద్రం చర్యలు తీసుకోవాలి
‘పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాల వేదన తీరనిది. ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. వీరుల కుటుంబాలకు కాంగ్రెస్‌తోపాటు దేశం యావత్తూ అండగా నిలుస్తుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి’ అని ట్విట్టర్‌లో ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గురువారం లక్నోలో తన మొట్ట మొదటి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆమె అమర జవాన్ల మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
- ప్రియాంకా గాంధీ

మరిన్ని వార్తలు