మరో కుట్రకు జైషే స్కెచ్‌

5 May, 2020 20:48 IST|Sakshi

తాలిబాన్‌ యూనిట్లలో జైషే ఉగ్రమూక

కాబూల్‌ : భారత్‌లో భారీ దాడులతో తీవ్ర అలజడి రేపేందుకు ఉ‍గ్ర సంస్థ జైషే మహ్మద్‌ పకడ్బందీ ప్రణాళికలు రచిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌ యూనిట్లలో 400 మంది జైషే ఉగ్రవాదులను మోహరించింది. వారిని భారత్‌లో ఉగ్ర దాడులతో హోరెత్తించేందుకు కశ్మీర్ లోయకు పంపేందుకు సన్నాహాలు చేపట్టినట్టు తెలుస్తోంది.  ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఏప్రిల్‌ 12న చేపట్టిన ఆపరేషన్‌లో ఆప్ఘన్‌ దళాలు ఓ ఉగ్ర శిబిరంలో ఈ తరహా కార్యకలాపాలను గుర్తించారని సమాచారం.

ఈ ఆపరేషన్‌లో అరెస్టయిన ఉగ్రవాదులను విచారించడంతో ఆప్ఘన్‌లో దాదాపు ఈ తరహా క్యాంపులు ఆరు వరకూ ఉండవచ్చని భారత భద్రతా, నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ శిబిరాల్లో జైషే మహ్మద్‌ 400 మంది ఉగ్రమూకను సంసిద్ధంగా ఉంచిందని ఢిల్లీ, కాబూల్‌లో ఉగ్రవాద కార్యకలాపాల వ్యతిరేక మిషన్‌ అధికారులు పేర్కొన్నారు. ఖోస్థ నుంచి జలాలాబాద్‌ వరకూ విస్తరించిన ప్రాంతాలతో పాటు కాందహార్‌ ప్రావిన్స్‌లోని పాక్‌ సరిహద్దుల్లోని తాలిబాన్‌ యూనిట్లలో జైషే క్యాడర్‌ను మోహరించారని కాబూల్‌లోని ఉగ్రవాద వ్యతిరేక దళానికి చెందిన అధికారి వెల్లడించారు. మరోవైపు ఐఎస్‌ఐ ప్రోత్సాహంతో జైషే మహ్మద్‌తో పాటు లష్కరే ఉగ్రవాదులను కూడా ఈ శిబిరాల్లోకి పంపారని అధికారులు చెబుతున్నారు.

చదవండి : పుల్వామా ఉగ్రదాడి : తండ్రికూతుళ్ల అరెస్ట్‌

మరిన్ని వార్తలు