కుట్లు అల్లికలు చవక

6 Aug, 2017 00:59 IST|Sakshi
కుట్లు అల్లికలు చవక

► జౌళి రంగ జాబ్‌వర్క్‌పై జీఎస్టీ 5 శాతం
► ట్రాక్టర్‌ విడి భాగాలపై 18 శాతం


న్యూఢిల్లీ: జౌళి రంగ జాబ్‌వర్క్‌(కుట్లు, అల్లికలు, నేత పని), ట్రాక్టర్‌ విడిభాగాలపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని తగ్గించారు. రవాణాకు ముందు ఆన్‌లైన్‌లో వస్తువుల ముందస్తు నమోదుకు సంబంధించి ఈ–వే బిల్లు నిబంధనలను సరళీకరించారు. ఆర్థిక మంత్రి  జైట్లీ నేతృత్వంలో శనివారం ఇక్కడ జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. అన్ని జౌళి ఉత్పత్తులకు చెందిన జాబ్‌వర్క్‌పై పన్నును 5 శాతానికి కుదించారు. ఎంబ్రాయిడరీ నుంచి కుట్టుపని వరకు అన్నీ ఈ పన్ను పరిధిలోకి వస్తాయి .వస్త్రాలు, శాలువాలు, తివాచీలకు ఈ రేటునే అనువర్తింపచేస్తారు.

వ్యవసాయ పరికరాల ధరలు తగ్గించేందుకు ట్రాక్టర్‌ విడి భాగాలు కొన్నింటిపై పన్ను రేటును 18 శాతానికి తగ్గించారు. జీఎస్టీ కింద ప్రభుత్వ పని కాంట్రాక్టులకు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను ఇస్తూ 12 శాతం పన్ను విధించారు. వస్తువులను అమ్మడానికి ముందు ఆన్‌లైన్‌లో నమోదుచేసుకోవడానికి ఉద్దేశించిన ఈ–వే బిల్లుకు జీఎస్టీ మండలి ఆమోద ముద్ర వేసింది. పన్ను మినహాయింపు పొందిన వస్తువులు ఈ–వే బిల్లుకు ఆవలే ఉంటాయి. ఈ విధానం అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది. హౌస్‌కీపింగ్‌ సేవలందించే సంస్థలు రివర్స్‌ చార్జ్‌ మెకానిజం కింద జీఎస్టీ చెల్లించాలి. క్యాబ్‌ సంస్థలు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌తో అయితే 12 శాతం , అది లేకుండా 5 శాతం పన్ను కట్టాలి.

మరిన్ని వార్తలు