విచారణలో కనిపించని జైట్లీ పేరు

28 Dec, 2015 01:06 IST|Sakshi
విచారణలో కనిపించని జైట్లీ పేరు

కేంద్ర మంత్రి పాత్రను తేల్చని డీడీసీఏ విచారణ కమిటీ
 
 న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) పలు అక్రమాలకు పాల్పడినట్లు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక పేర్కొంది. అయితే ఈ నివేదికలో ఎక్కడా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రస్తావన కనిపించకపోవడం గమనార్హం.  జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్రమాలు జరిగాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోపాటు ఇతర విపక్షాలు ఆరోపించడం తెలిసిందే. ఢిల్లీ విజిలెన్స్ విభాగం ముఖ్యకార్యదర్శి చేతన్ సంఘీ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ డీడీసీఏ వ్యవహారాలపై విచారణ జరిపి 237 పేజీల నివేదికను రూపొందించింది. ఇందులో జైట్లీపై వచ్చిన ఆరోపణలను ఎక్కడా నిర్ధారించలేదు. డీడీసీఏపై ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ వెంటనే స్పందించి సస్పెం డ్ చేసి ఉండాల్సిందని పేర్కొంది. ఎలాంటి ముందస్తు అనుమతుల్లేకుండా స్టేడియంలో కార్పొరేట్ బాక్స్‌లు నిర్మించారని, వయో నిర్ధారణ సరిఫికెట్ల జారీలో ఫోర్జరీ జరిగిందని వెల్లడించింది. డీడీసీఏ వ్యవహారాలను చక్కదిద్దడానికి జస్టిస్ లోధా కమిటీ సలహాలు కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలంది.  

 కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి: బీజేపీ
 జైట్లీకి వ్యతిరేకంగా  ఆధారాలు చూపించలేకపోయిన నేపథ్యంలో కేజ్రీవాల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. విచారణ కమిటీ నివేదిక ఎక్కడా జైట్లీ ప్రమేయం గురించి చెప్పలేదని,  నిజమేంటో తెలిసిందని బీజేపీ ప్రతినిధి ఎంజే అక్బర్ పేర్కొన్నారు. కేజ్రీవాల్.. జైట్లీకి బహిరంగ క్షమాపణ చెప్పి, కోర్టులో తప్పును ఒప్పుకోవాలన్నారు.

 మా ఇంట్లో సీబీఐ సోదాలు చేస్తే దొరికేవి మఫ్లర్లే: కేజ్రీవాల్
 డీడీసీఏ  విచారణ నుంచి జైట్లీ పారిపోతున్నారని, కమిటీ నివేదికకు బీజేపీ తప్పుడు అన్వయాన్ని చేస్తోందని ఆప్ ఆరోపించింది. జైట్లీ  అమాయకుడైతే విచారణకు సహకరించాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కాగా,  ఢిల్లీ సెక్రటేరియట్‌లో సీబీఐ దాడులకు సంబంధించి ప్రధానిపై  కేజ్రీ విమర్శలు చేశారు. సీబీఐ అధికారులు తన నివాసంలో సోదాలు చేసినట్లయితే వారికి లెక్కల్లోలేని మఫ్లర్లే దొరుకుతాయన్నారు. మోదీజీ ఆదేశాలలో తన ఆఫీసులో సోదాలు చేశారని, అయితే ఏమీ దొరకలేదని చెప్పారు.  తన ఇంట్లో సీబీఐ సోదాలు చేస్తే నాలుగు మఫ్లర్లు తప్ప ఏమీ దొరకవని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మఫ్లర్ మ్యాన్ రిటర్న్స్ అనే ప్రచారాన్ని ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, కాంగ్రెస్ చీఫ్ సోనియా చెప్పిన మాటలు విని తాను లోక్‌సభలో డీడీసీఏ అంశాన్ని ప్రస్తావించలేదని.. అవినీతిపై తన పార్టీ చేస్తున్న పోరాటాన్ని సమర్థించానని బీజేపీ సస్పెండ్ ఎంపీ కీర్తీ ఆజాద్ వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు