సర్దార్‌ డ్యాం’పై ఆందోళనలు

18 Sep, 2017 03:32 IST|Sakshi

భోపాల్‌:  నర్మదా నదిపై నిర్మించిన సర్దార్‌ సరోవర్‌ డ్యాం వల్ల నిర్వాసితులయ్యేవారికి పరిహారం డిమాండ్‌ చేస్తూ మధ్యప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన వెంటనే భోపాల్‌లో సీపీఎం నాయకురాలు సుభాషిణి అలీ నేతృత్వంలో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ డ్యాం నిర్మాణంతో ప్రభావితమవుతున్న 40 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాలని పార్టీ జిల్లా కార్యదర్శి పుషాన్‌ భట్టాచార్య డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ సీపీఎం ఆందోళనలు కొనసాగించింది.  మరోవైపు, బార్వాని జిల్లాలో నర్మదా నదిలో నడుము లోతు వరకు నిల్చొని మూడు రోజులుగా జల సత్యాగ్రహాం చేస్తున్న నర్మదా బచావో ఆందోళన్‌(ఎన్‌బీఏ) నాయకురాలు మేధా పాట్కర్‌ తన ఆందోళనను విరమించారు. అయినా నిర్వాసితుల కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిరుపేద రైతుల అభివృద్ధికి కాకుండా వారి వినాశనానికి దారితీస్తుందని ప్రముఖ పర్యావరణ సంస్థ గ్రీన్‌పీస్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

>
మరిన్ని వార్తలు