కళ్లు దించు అంటూ కళ్లజోడు లాక్కొన్నారు..

18 Dec, 2019 11:54 IST|Sakshi

జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఆవేదన

న్యూఢిల్లీ:  పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ ఘటనల్లో ఎంతో మంది పౌరులు తీవ్ర గాయాల పాలవుతున్నారు. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై పలువరు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అనుమతి లేకుండా ఆదివారం జెఎంఐలోకి ప్రవేశించి, విద్యార్థుల తరగతి గదుల్లో చొరబడి మరీ వెంబడించి కొట్టారని పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లైబ్రరీలో చదువుకుంటున్న అమాయకులపై దౌర్జన్యం చేశారంటూ ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ క్రమంలో కొంతమంది జామియా విద్యార్థులు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి జాతీయ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. మహ్మద్‌ ముస్తఫా అనే విద్యార్థి మాట్లాడుతూ... ‘ నేను లైబ్రరీలో చదువుకుంటున్న సమయంలో టియర్‌ గ్యాస్‌ వాసన వచ్చింది. పోలీసులు వచ్చి లైబ్రరీలో ఉన్నవాళ్లందరినీ కొట్టారు. నా లాప్‌టాప్‌ పగులగొట్టారు. నన్ను కొట్టడం మొదలుపెట్టారు. దేవుడిని తలచుకోండి అంటూ ఆఙ్ఞలు జారీ చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికే నన్ను పోలీసు స్టేషనుకు తరలించారు. కాళ్లు, చేతులపై తీవ్రంగా కొట్టారు. నా రెండు చేతులు ఫ్రాక్చరయ్యాయి. మందుల కోసం అడిగే వాళ్లను చచ్చిపోనివ్వండి అంటూ విద్యార్థులను ఉద్దేశించి పోలీసులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నన్ను ఆరోజు ఎన్‌కౌంటర్‌ చేస్తారేమోనని భయంతో చచ్చిపోయా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.(‘నేను ముస్లిం కాదు.. అయినా సీఏఏని వ్యతిరేకిస్తున్నాను’)

ఇక మరో విద్యార్థి హమ్జాలా ముజీబీ(21) మాట్లాడుతూ.. ‘ఆరోజు లైబ్రరీ మొత్తాన్ని పోలీసులు చుట్టుముట్టారు. సీసీటీవీలను పగులగొట్టారు. మమ్మల్ని అందరినీ లైన్లో నిల్చోబెట్టి కొట్టారు. మా ఫోన్లు పగులగొట్టారు. మీరెంత మీ వయసెంత. మీకు స్వాతంత్ర్యం కావాలా అంటూ ప్రశ్నించారు. వారి వైపు తీక్షణంగా చూస్తుంటే కళ్లు దించరా అంటూ నా కళ్లజోడు లాక్కొన్నారు అంటూ భయానక అనుభవం గురించి ఇండియా టుడేతో చెప్పుకొచ్చాడు. కాగా పార్లమెంటు ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది.  

మరిన్ని వార్తలు