కశ్మీర్‌ విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం

6 Aug, 2019 19:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. మంగళవారం రాత్రి లోక్‌సభలో హోంమంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టిన జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019కు అనుకూలంగా 370 మంది, వ్యతిరేకంగా 70 మంది ఓటు వేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35–ఏలను రద్దు చేసిన తీర్మానం కూడా లోక్‌సభ ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 351 మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. ఒకరు గైర్హాజరయ్యారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, జేడీ(యూ) సభ నుంచి వాకౌట్‌ చేశాయి.

లోక్‌సభ ఆమోదంతో జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35–ఏల రద్దు తీర్మానాలను పార్లమెంట్‌ ఆమోదించినట్టైంది. ఈ రెండింటినీ రాజ్యసభ సొమవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టంగా మారనుంది. బిల్లును ఆమోదించిన తర్వాత లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. కశ్మీర్‌ విభజన బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందడంతో లదాఖ్‌ పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుంది. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్‌ ఉంటుంది. జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేయడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.

చరిత్ర సృష్టించిన లోక్‌సభ
17వ లోక్‌సభ మొదటి సెషన్‌లోనే 36 బిల్లులను ఆమోదించి సరికొత్త చరిత్ర సృష్టించింది. 280 గంటలపాటు సభా కార్యక్రమాలు సాగాయి. 183 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు.

మరిన్ని వార్తలు