పండుగ పూట రాజ్‌భవన్‌ ఖాళీ..

22 Nov, 2018 12:11 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీని రద్దు చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్న గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. అసెంబ్లీ రద్దు నిర్ణయం సరైన సమయంలోనే జరిగిందని చెప్పుకొచ్చారు. గత కొద్ది నెలలుగా అసెంబ్లీని రద్దు చేయాలని కోరిన మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని సిద్ధాంత వైరుధ్యాలతో కూడిన పార్టీలతో కలిసి కోరుతున్నారని గవర్నర్‌ పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ తాను చేసిన ఫోన్‌ కాల్స్‌, ఫ్యాక్స్‌ సందేశాలకు గవర్నర్‌ బదులివ్వలేదన్న మెహబూబా ముఫ్తీ ఆరోపణలపై ఆయన స్పందించారు.

ఈద్‌ రోజు రాజ్‌భవన్‌లో ఎవరూ లేరని, కనీసం తనకు ఆహారాన్ని అందించేందుకూ ఎవరూ అందుబాటులో లేరని, ఆమె ఈద్‌ ముందు రోజు తనను సంప్రదించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. తాను ఫ్యాక్స్‌ సందేశాన్ని అందుకున్నా తన నిర్ణయంలో మార్పు ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ఫిరాయింపులు, పేలవమైన సర్ధుబాట్లతో కూడిన ప్రభుత్వ ఏర్పాటును అనుమతించరాదని తాను గట్టిగా నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. కాగా 87 మంది సభ్యులున్న అసెంబ్లీలో తమ పార్టీ పీడీపీకి కాంగ్రెస్‌ నుంచి 12 మంది, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి 15 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 56 మంది సభ్యులున్నారని, దీంతో తమ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్యాబలం ఉందని గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇక పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన సజద్‌ లోన్‌ సైతం ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్‌కు కోరారు. ఇద్దరు సభ్యులున్న పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌కు బీజేపీ ఎమ్మెల్యేలు 25 మంది, ఇతర ఎమ్మెల్యేలు 18 మంది మద్దతు పలుకుతున్నారని సజద్‌ లోన్‌ తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా ముఫ్తీ సర్కార్‌కు బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ఈ ఏడాది జూన్‌ నుంచి జమ్ము కశ్మీర్‌ గవర్నర్‌ పాలనలో ఉన్న విషయం తెలిసిందే.  గవర్నర్‌ అప్పట్లో అసెంబ్లీని రద్దు చేయకుండా సుప్త చేతనావస్ధలో ఉంచారు.

మరిన్ని వార్తలు