జాతీయ ఉపద్రవంగా ప్రకటించండి

14 Sep, 2014 04:42 IST|Sakshi
జాతీయ ఉపద్రవంగా ప్రకటించండి

ప్రధానికి జమ్మూకాశ్మీర్ రాష్ట్రం విజ్ఞప్తి
శ్రీనగర్: భారీ వరదల ధాటికి విలవిలలాడిన జమ్మూ కాశ్మీర్ ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతోంది. వరద నీరు శనివారం నాటికి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. 1.5 లక్షల మందిని ఇప్పటి వరకూ రక్షించినట్లు రక్షణ శాఖ ప్రతినిధి శనివారం ఇక్కడ ప్రకటించారు. అయితే, ఇంకా 1.5 లక్షల మంది వరదనీటిలోనే చిక్కుకుని ఉన్నట్లు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు.  

సెంట్రల్ కాశ్మీర్‌లో వరదనీరు తగ్గుముఖం పట్టిందని, అయితే ఇంకా ప్రమాదకర స్థాయి కంటే పైనే ఉందని చెప్పారు. అది ఆ స్థాయి నుంచి తగ్గిన తర్వాత జీలం నదీ తీరంలో ఉల్లంఘనలను తొలగిస్తామన్నారు. వరదనీరు తగ్గుముఖం పడుతుండడంతో వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయేమోననే ఆందోళనలు తలెత్తుతున్నాయి.
 
ఆదుకోవాలంటూ ప్రధానికి వినతి
జమ్మూకాశ్మీర్ చరిత్రలో 109 ఏళ్లలో సంభవించి న అతిపెద్ద విలయంగా అధికారులు తేల్చడం తో... ఈ ప్రకృతి విపత్తును ‘జాతీయ విపత్తుగా’ ప్రకటించాలని జమ్మూ కాశ్మీర్‌కు చెందిన మం త్రుల బృందం ప్రధాని నరేంద్రమోడీని శని వారం ఢిల్లీలో ప్రత్యేకంగా కలసి విజ్ఞప్తి చేసింది. ఉదారంగా ఆర్థిక సాయం అందించాలని, రాష్ట్రంలో పరిస్థితులు కుదుటపడేందుకు ప్రత్యేక పునరావాస ప్యాకేజీ ప్రకటించాలని కోరింది.  
 
ఢిల్లీకి 24 మంది తెలుగు విద్యార్థులు
జమ్మూ కాశ్మీర్ వరదల నుంచి క్షేమంగా బయటపడిన మరో 24 మంది తెలుగు విద్యార్థులు శనివారం  ఢిల్లీలోని ఏపీ భవన్‌కు చేరుకున్నారు. వీరందరినీ ఏపీ ప్రభుత్వ ఖర్చులతో వారి స్వస్థలాలకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఏపీ ప్రభుత్వ  ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు తెలిపారు.
 
సహాయక చర్యల్లో డీఆర్‌డీవో బృందం
సాక్షి, హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్  వరద బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) బృందం కూడా రంగంలోకి దిగింది. ఔషధాలు, ఆహార పదార్థాలతో మంగళవారం శ్రీనగర్‌కు చేరుకున్న డీఆర్‌డీవో బృందం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యల్లో పాల్గొంటోందని డీఆర్‌డీవో అధికారులు తెలిపారు. 9 టన్నుల ఆహార పదార్థాలను వరద బాధితులకు పంపిణీ చేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ సేవల కోసం డీఆర్‌డీవోకు చెందిన ‘శాట్‌కామ్’ మొబైల్ శాటిలైట్ సర్వీసెస్ టర్మినల్‌ను శ్రీనగర్‌కు విమానంలో తరలించారని, ఈ టర్మినల్ ద్వారా శ్రీనగర్ సీఆర్‌పీఎఫ్ కార్యాలయాన్ని ఢిల్లీలోని కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారని తెలిపారు.

మరిన్ని వార్తలు