కశ్మీర్‌లో మువ్వన్నెల రెపరెపలు

26 Aug, 2019 03:47 IST|Sakshi
శ్రీనగర్‌లోని సెక్రటేరియల్‌ భవనం

జమ్మూకశ్మీర్‌ సచివాలయంపై ఆ రాష్ట్ర జెండా తొలగింపు

న్యూఢిల్లీ: రాష్ట్ర సచివాలయ భవనంపై ఉన్న జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర జెండాను అధికారులు తొలగించారు. ఆర్టికల్‌ 370 రద్దు పూర్తయ్యి మూడు వారాలు అవుతున్న క్రమంలో దీన్ని తొలగించడం గమనార్హం. వాస్తవానికి జమ్మూ కశ్మీర్‌ జెండాను అక్టోబర్‌ 31న తొలగించాల్సి ఉన్నప్పటికీ అధికారులు ముందుగానే తొలగించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ దీన్ని తొలగించనున్నామని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయానికి కేవలం మువ్వన్నెల భారత జెండా మాత్రమే ఎగురుతూ కనిపించింది. 1952, జూన్‌ 7 నుంచి రెండు జెండాలు ఎగిరేలా ఆర్టికల్‌ 370 వీలు కల్పించిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌లో నిత్యావసరాలకు, మందులకు దిగుల్లేదని ఆ రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ అన్నారు. ప్రజలకు అవసరమైన ముడి సరుకులు అన్నింటిని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. సమాచార వ్యవస్థను నిలిపివేయడం ద్వారా ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు.   

కశ్మీర్‌లో పరిస్థితులు అసాధారణం: రాహుల్‌
కేంద్రం చెబుతున్నట్లు కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణంగా లేవని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల బృందం శనివారం కశ్మీర్‌ను సందర్శించడానికి ప్రయత్నించగా అధికారులు వారిని శ్రీనగర్‌ విమానాశ్రయంలో నిలిపివేసిన సంగతి తెలిసిందే. శ్రీనగర్‌లో తమ బృందం ఎదుర్కొన్న పరిస్థితులను రాహుల్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. కశ్మీరీలకున్న స్వాతంత్య్రం కోల్పోయి 20 రోజులు అవుతోందన్నారు.

మరిన్ని వార్తలు