డిప్యూటీ తహసీల్దార్‌ అభ్యర్థి గాడిద..!!

28 Apr, 2018 09:46 IST|Sakshi
జమ్మూ, కశ్మీర్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ జారీ చేసిన హాల్‌ టికెట్‌

శ్రీనగర్‌ : ఎవరినైనా తిట్టాలంటే గాడిద..! అనే పదానికి ఇంకా ఏవేవో జతచేసి వారి దుమ్ము దులుపుతాం. ఇక సరదా సంభాషణల్లో గాడిద గుడ్డు..! అనే పద ప్రయోగం కూడా ఉంది. ఎందుకంటే మనం గాడిదకు అంత అల్ప ప్రాధాన్యం ఇస్తాం. కానీ.. జమ్మూ కశ్మీర్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) గాడిదకు గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. డిప్యూటీ తహసీల్దార్‌ పరీక్షలో పోటీ పడేందుకు గాడిదకు హాల్‌ టికెట్‌ జారీ చేసింది.

అభ్యర్థి పేరు ‘కచౌర్‌ ఖర్‌’ (గోధుమ రంగు గాడిద) అంటూ, హాల్‌ టికెట్‌పై గాడిద ఫోటోని కూడా ముద్రించి నవ్వులపాలైంది. ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఎస్‌ఎస్‌బీ నిర్వాకంపై ట్విటర్‌, ఫేస్‌బుక్‌లలో కామెంట్ల వర్షం కురుస్తోంది. వేలకు వేలు జీతాలు తీసుకోవడమే కాకుండా అధికారుల అలసత్వం వల్ల గాడిదలకు పరీక్షలు నిర్వహించే స్థాయికి ఎస్‌ఎస్‌బీ చేరిందంటూ ఒక నెటిజన్‌ ఘాటైన ట్వీట్‌ చేశాడు. ఎస్‌ఎస్‌బీ చర్యలు నవ్వు తెప్పిస్తోంది. అది గాడిదకి హాల్‌ టికెట్‌ జారీ చేయడం ఒక విడ్డూరమైతే.. ఆ వార్త వైరల్‌ కావడం మరో విడ్డూరమంటూ ఫేస్‌బుక్‌లో మరో వ్యక్తి తన అసహనం వ్యక్తం చేశాడు.

కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు ఎస్‌ఎస్‌బీ అధికారులు నిరాకరించారు. సాంకేతిక పొరపాటు వల్ల ఇలాంటి తప్పిదమే గతంలోనూ చోటు చేసుకుంది. 2015లో ఒక కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ కోసం ఎస్‌ఎస్‌బీ ఆవు పేరిట హాల్‌ టికెట్‌ జారీ చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో తన సర్వర్‌ నుంచి ఆవు పేరుతో నమోదైన అప్లికేషన్‌ను తొలగించింది.

>
మరిన్ని వార్తలు