అరబిందో చేతికి జనరిస్‌ ఫార్మా

8 Jan, 2017 10:14 IST|Sakshi

రూ.969 కోట్లతో కొనుగోలుకు ఒప్పందం  

న్యూఢిల్లీ: పోర్చుగల్‌ కేంద్రంగా పనిచేస్తున్న జనరిక్‌ ఔషధ కంపెనీ ‘జనరిస్‌ ఫార్మాస్యూటికా’ను అరబిందో ఫార్మా సొంతం చేసుకుంది. 135 మిలియన్‌ యూరోలు చెల్లించి దీన్ని సొంతం చేసుకోవటానికి ఒప్పందం చేసుకుంది. ఇది మన కరెన్సీలో దాదాపు రూ.969 కోట్లు. ప్రస్తుతం ఈ సంస్థ మాగ్నమ్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ చేతిలో ఉంది. తన అనుబంధ సంస్థ ఏజైల్‌ ఫార్మా నెదర్లాండ్స్‌ ద్వారా ఈ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు అరబిందో యూరోపియన్‌ ఆపరేషన్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.మురళీధరన్‌  చెప్పారు.

ఈ రెండు సంస్థలకూ సంబంధించి పలు ఔషధాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో వచ్చే అయిదేళ్లలో మరిన్ని పేటెంట్‌లు వస్తాయని ఆయన తెలియజేశారు. యూరోపియన్‌ మార్కెట్‌లో తమ స్థానాన్ని పటిష్ఠం చేసుకోవటానికి కట్టుబడి ఉన్నామని, తాజా కొనుగోలు కూడా దీన్నే సూచిస్తుందని చెప్పారాయన. ఈ  ఒప్పందానికి  పోర్చుగీసు నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఒప్పందంతో పోర్చుగల్‌లోని అమడొరాలో ఉన్న 1.2 బిలియన్‌ ట్యాబ్లెట్స్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటు అరబిందో సొంతమవుతుంది.

మరిన్ని వార్తలు