యూపీలో ఘోర రైలు ప్రమాదం

21 Mar, 2015 02:05 IST|Sakshi
యూపీలో ఘోర రైలు ప్రమాదం
  • పట్టాలు తప్పిన జనతా ఎక్స్‌ప్రెస్..
  • 38 మంది దుర్మరణం.. 150 మందికి గాయాలు
  • బ్రేకులు ఫెయిలవడంతో స్టేషన్‌లో ఆగకుండా ముందుకు దూసుకెళ్లిన రైలు
  • ఇంజిన్-కోచ్‌ల మధ్య ‘బ్రేక్ పైప్‌లైన్’ విఫలమవడమే కారణం!
  •  
    రాయ్‌బరేలీ/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్‌బరేలీ జిల్లాలోని బచ్రావాన్ రైల్వే స్టేషన్ సమీపంలో డెహ్రాడూన్-వారణాసి మధ్య నడిచే జనతా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 38 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 150 మంది గాయాలపాలయ్యారు. 34 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. బ్రేకులు ఫెయిల్ అవడంతోనే దుర్ఘటన జరిగి ఉండొచ్చని ప్రమాదం తీరును బట్టి అంచనా వేస్తున్నారు. రైలు ఇంజిన్, దాన్ని ఆనుకొని ఉన్న రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో ఒకటి జనరల్ బోగీ. మృతుల్లో ఎక్కువ మంది ఈ బోగీలో ప్రయాణిస్తున్నవారే. ఈ కోచ్ పూర్తిగా దెబ్బతినడంతో గ్యాస్ కట్టర్లు, క్రేన్ల సాయంతో బోగీలోని మృతదేహాలను, క్షతగాత్రులను వెలికితీశారు.

    పట్టాల తప్పిన మరో బోగీ గార్డులకు సంబంధించింది. ఇందులో ప్రమాద సమయానికి ఎక్కువ మంది లేకపోవడంతో మృతుల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనపై విచారణకు ఆదేశించిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.20 వేల పరిహారం ప్రకటించారు. యూపీ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించింది.
     
    హృదయవిదారకంగా ప్రమాదస్థలి..
    కళ్ల ముందే రక్తపుమడుగులో కొట్టుమిట్టాడి ప్రాణాలు కోల్పోయిన తన చెల్లిని తలచుకుంటూ గుండెలవిసేలా విలపిస్తున్న ఓ అన్న.. అప్పటిదాకా తనతో మాట్లాడి అంతలోనే ప్రాణాలు కోల్పోయిన తల్లి, సోదరుడిని గుర్తుతెచ్చుకుని వెక్కివెక్కి ఏడుస్తున్న ఓ బాలుడు.. ఒకటా.. రెండా.. ఇలాంటి హృదయవిదారక దృశ్యాలెన్నో ప్రమాదస్థలిలో కనిపించాయి. క్షతగాత్రులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ప్రమాదం సరిగ్గా శుక్రవారం ఉదయం 9.10 నిమిషాలకు చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అక్కడి స్థానికులు అధికారుల కన్నా ముందే ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దుర్ఘటన జరిగిన చాలా సేపటికి అధికారులు వచ్చారని, ముందే వచ్చి ఉంటే కొందరైనా బతికేవారని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు.

    రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా, రైల్వేబోర్డు చైర్మన్ ఏకే మిట్టల్, లక్నో జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను సహాయక సిబ్బంది లక్నోలోని ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోంమంత్రి రాజ్‌నాథ్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతం సోనియా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ జిల్లాలోనిదే కావడం గమనార్హం.
     
    ప్రమాదానికి కారణమేంటి..?
    ప్రమాదానికి గురైన రైలు వాస్తవానికి ఉదయం 9.10 గంటలకు బచ్రావాన్ స్టేషన్‌లో ఆగాలి. కానీ ఆగకుండా అలాగే వెళ్లి పట్టాలు తప్పింది. డ్రైవర్ బ్రేకులు వేసినా అవి పనిచేయకపోయి ఉంటాయని ప్రత్యక్ష సాక్షులు, అధికారులు భావిస్తున్నారు. ఇంజిన్-బోగీలను అనుసంధానించే బ్రేక్ పైప్‌లైన్ విఫలమవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని చెబుతున్నారు. ‘‘రైలు డ్రైవర్, గార్డు ఇద్దరూ చాలా ఆందోళనగా వాకీటాకీలో మాట్లాడడం చూశా. డోర్ వద్ద నుంచి సిగ్నల్ ఇచ్చారు. బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.. మరో లైన్ ఇవ్వాల్సిందిగా స్టేషన్ మాస్టర్‌ను వాళ్లు అడిగినట్టున్నారు. కానీ అంతలోనే రైలు పట్టాలు తప్పింది. ఇంజిన్ వెనకున్న బోగీలు బలంగా ఢీకొన్నాయి’’ అని శివ మోహన్ అనే ప్రయాణికుడు చెప్పాడు. ఇంజిన్ వెనక బోగీలోనే ఉన్న ఈయన.. ప్రమాదం సమయంలో రైల్లోంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు.

>
మరిన్ని వార్తలు