అధికారుల పరువు పోయింది: జయా బచ్చన్‌

2 Dec, 2019 12:27 IST|Sakshi

న్యూఢిల్లీ : దిశ అత్యాచారం, హత్య ఘటన కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, నటి జయా బచ్చన్‌ అన్నారు. ఈ ఘటన జరిగిన సమీప ప్రాంతంలోనే మరో ఘటన కూడా జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వాలే కచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనపై రాజ్యసభ చర్చ జరిగింది. ఈ క్రమంలో చర్చ సందర్భంగా జయా బచ్చన్‌ మాట్లాడుతూ... ఈ కేసులోని నిందితులను ప్రజల్లోకి తీసుకువచ్చి.. మూకదాడి చేసి చంపేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి నేరస్తులకు విదేశాల్లో ప్రజలే శిక్ష వేస్తారు అని పేర్కొన్నారు. ‘నిర్భయ, కథువా, హైదరాబాద్‌ వంటి ఘటనల్లో ప్రభుత్వాలు ఎలా విచారణ జరిపాయి. బాధితులకు ఏం న్యాయం చేశాయో చెప్పాలి. ఇక హైదరాబాద్‌లో దిశ ఘటనకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అధికారులు ఏం చేస్తున్నారు. నిందితులతో పాటు వైఫల్యం చెందిన అధికారుల పేర్లు బహిర్గతం చేయాలి. పరువు తీయాలి. ఈ ఘటనతో అధికారుల పరువు పోయింది’ అని దుయ్యబట్టారు.

కాగా తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశ హత్య కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులు.. ఏ-1 మహమ్మద్‌ ఆరిఫ్‌ (26), ఏ-2 జొల్లు శివ (20), ఏ-3 జొల్లు నవీన్‌ (20), ఏ-4 చింతకుంట చెన్నకేశవులు (20) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. దిశను లాక్కెళ్లి, లైంగికదాడికి పాల్పడి, హత్య చేయడం అంతా 28 నిమిషాల్లోనే జరిగిందని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలో నిందితులను ఉరి తీయాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు