గ్రామస్తుల గోడు ఆలకించిన సీఎం

13 Sep, 2014 00:23 IST|Sakshi
గ్రామస్తుల గోడు ఆలకించిన సీఎం

వాచ్ఛాత్తి బాధితులకు సీఎం జయలలిత భరోసా ఇచ్చారు. 105 మందికి తలా రూ.60 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు.

సాక్షి, చెన్నై: వాచ్ఛాతి బాధితుల మొరను సీఎం జయలలిత ఆలకించారు. వారికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం 105 మంది బాధితులకు తలా రూ.60వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాలని ఆదేశాలు జారీ చేశారు. 1992 జూన్ 20వ తేదిన ధర్మపురి జిల్లా అరూర్ సమీపంలోని వాచ్ఛాత్తి గ్రామం అధికారుల పైశాచికత్వానికి బలైంది. చందనపు దుంగల్ని అక్రమంగా నిల్వ ఉంచారన్న నెపంతో సాగిన ఈ వీరంగం చివరకు ఆ గ్రామంలోని మహిళల మీద దాష్టీకానికి దారి తీసింది. ఆ గ్రామంలోని 90 మంది మహిళలు, 28 మంది పిల్లలు, 15 మంది పురుషులపై తమ ప్రతాపం చూపారు.
 
మొత్తంగా 133 మందిపై కేసులు నమోదు చేశారు. అదే సమయంలో ఆ గ్రామంలోని 18 మంది మహిళలపై దాడుల్లో పాల్గొన్న సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం అప్పట్లో కలకలం రేపింది. ఈ దాడిలో పాల్గొన్న 269 మంది అధికారులు, సిబ్బందిపై అధికార దుష్ర్పయోగం, దాడులు, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసును సీబీఐకు అప్పగించారు. ఏళ్ల తరబడి సాగిన విచారణలో రెండేళ్ల క్రితం తీర్పు వెలువడింది. దాడిలో పాల్గొన్న అధికారులందరూ దోషులేనని పేర్లతోసహా ప్రకటించి శిక్ష ఖరారు చేశారు. దీంతో ఆ గ్రామ ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే తమను ఆదుకోవాలంటూ అక్కడి ప్రజలు రెండు రోజుల క్రితం ఆందోళనకు దిగారు.
 
సీఎం భరోసా
ఆందోళనకారుల మొరను సీఎం జయలలిత ఆలకించారు. ఆ గ్రామస్తుల్ని శుక్రవారం సచివాలయానికి పిలిపించారు. వారి గోడను విన్నారు. తమను ఆదుకోవాలని, సాయం అందించాలని ఆ గ్రామ మహిళలు చేసుకున్న విజ్ఞప్తికి జయలలిత స్పందించారు. తానున్నాంటూ భరోసా ఇచ్చి పంపారు. అనంతరం ఆ గ్రామస్తులను ఆదుకుంటూ ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. వాచ్ఛాత్తి ఘటనను గుర్తుచేస్తూ, ఆ గ్రామాన్ని ఆదుకునే విధంగా తన ప్రభుత్వం అన్నిచర్యల్ని చేపట్టిందని వివరించారు. కోటి రెండు లక్షలు ఖర్చు పెట్టినట్టు పేర్కొన్నారు. తమను మరింతగా ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేసిన దృష్ట్యా, 105  మందికి తలా రూ.60 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటిస్తున్నామని తెలిపారు. ఆ బాధితులకు ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు