త్వరలోనే పార్టీని ఏఐఏడీఎంకేలో విలీనం చేస్తాను: దీప

20 Aug, 2019 12:12 IST|Sakshi

చెన్నై: ‘పురుచ్చి తలైవి’ జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాల్లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్.. కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. అయితే గత కొద్ది రోజులుగా దీప తన పార్టీని ఏఐఏడీఎంకేలో విలీనం చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దీప పార్టీ, ఏఐఏడీఎంకేకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ విలీనంపై దీప స్పందించారు. త్వరలోనే తన పార్టీని ఏఐఏడీఎంకేలో విలీనం చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ.. ‘‘అమ్మ’ మరణానంతరం ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో మీరంతా చూశారు. ఆ సమయంలో కొందరు అభిమానులు నా ఇంటికి వచ్చి అమ్మ వారసురాలిగా కొనసాగలని కోరారు. రాజకీయాల్లోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వారి కోరిక మేరకు నేను ‘ఎంజీఆర్‌ అమ్మ దీప పెరవాయి’ అనే నూతన పార్టీని ప్రారంభించాను. కానీ రాజకీయాలు నాకు సంతృప్తినివ్వలేదు. అంతేకాక ఓ మహిళ రాజకీయాల్లో రాణించడం అంత సులువు కాదని కూడా గ్రహించాను. అది కాక ఈ మధ్య నా ఆరోగ్యం కూడా సరిగా ఉండటం లేదు. పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించలేను. అందుకే మా పార్టీని ఏఐఏడీఎంకేలో విలీనం చేయాలని భావిస్తున్నాను. గత లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ ఏఐఏడీఎంకే పార్టీకి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ విలీనానికి మా కాడర్‌ కూడా పూర్తి మద్దతిస్తుంది’ అని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు దీప.

మరిన్ని వార్తలు