నన్ను అమ్మ పెట్టారు.. ఇప్పటికీ నేనే సీఎస్!

27 Dec, 2016 11:26 IST|Sakshi
నన్ను అమ్మ పెట్టారు.. ఇప్పటికీ నేనే సీఎస్!
''పురచ్చితలైవి అమ్మ నన్ను నియమించారు.. ఇప్పటికీ నేనే చీఫ్ సెక్రటరీని. నన్ను బదిలీ చేస్తూ ఇంతవరకు ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. అమ్మే బతికుంటే ఇలా జరిగేదా.. అసలు చీఫ్ సెక్రటరీ ఇంటిమీద, ఆఫీసులో ప్రవేశించడానికి వాళ్లకు ఎంత ధైర్యం'' అంటూ తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహనరావు మండిపడ్డారు. ఈనెల 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు సీఆర్పీఎఫ్ భద్రతతో ఆదాయపన్ను అధికారులు ఆయన ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లపై దాడిచేసి పెద్దమొత్తంలో నగలు, నగదు, పత్రాలను స్వాధీనం చేసుకున్న తర్వాత.. ఇన్నాళ్లకు ఆయన మీడియా ముందుకు వచ్చారు. శేఖర రెడ్డితో తనకు సంబంధం లేదని, ఆయనతో తాను ఎలాంటి లావాదేవీలు జరపలేదని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చీఫ్ సెక్రటరీ కార్యాలయం మీద రాజ్యాంగ దాడి చేయడమేనని, ఈ ప్రభుత్వానికి తనను బదిలీ చేసే దమ్ములేదని అన్నారు. తనను పురచ్చితలైవి అమ్మ అపాయింట్ చేశారని, ఇప్పటికీ తానే చీఫ్ సెక్రటరీనని గర్జించారు. ఇప్పటివరకు తనకు బదిలీ ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదని, అందువల్ల ఇప్పుడు ఉన్న ఆమె ఇన్‌చార్జి అయి ఉంటారని చెప్పారు. 
 
తెల్లవారుజామున 5.30 గంటలకు వాళ్లు తన ఇంట్లోకి వచ్చారని, కానీ వాళ్లు చూపించిన సెర్చివారంటులో తన పేరు లేదని రామ్మెహనరావు అన్నారు. తన కొడుకు పేరు ఉందని, అతడేమైనా చీఫ్ సెక్రటరీయా అని ప్రశ్నించారు. తన కొడుకు అమెరికా నుంచి వచ్చిన తర్వాత కేవలం వారం రోజులు మాత్రమే తన ఇంట్లో ఉన్నాడని, తర్వాత ఎప్పుడూ అసలు ఇంట్లోనే లేడని చెప్పారు. ఆదాయపన్ను శాఖ అధికారులకు తన ఇంట్లో కేవలం రూ. 1,12,322 నగదు మాత్రమే దొరికిందని అన్నారు. తన కూతురు, భార్యకు సంబంధించిన 42 కాసుల బంగారం ఉందని, దాంతోపాటు వెండితో చేసిన మహాలక్ష్మి, వెంకటేశ్వరుడు, వినాయకుడి బొమ్మల లాంటివి 25 కిలోలు దొరికాయని తెలిపారు. తన ఇంట్లో సీక్రెట్ చాంబర్ ఉందన్నారని, కానీ అది స్టోర్ రూం మాత్రమేనని, అందులో పాత సామాన్లు, పనికిరాని దుస్తులు ఉన్నాయని రామ్మోహనరావు చెప్పారు. 
 
అసలు తన ఇంట్లో, కార్యాలయంలో సోదాలకు వాళ్లు ముఖ్యమంత్రి అనుమతి తీసుకున్నారో లేదో తెలియదని ఆయన చెప్పారు. తన కార్యాలయంలో కూడా మంత్రులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల మీద క్రిమినల్ ఆరోపణలు ఏమీ వాళ్లకు దొరకలేదని, కేవలం కొంతమంది ప్రజలిచ్చిన వినతిపత్రాలే ఉన్నాయని అన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది.. ఇందులో కేంద్రం పాత్ర ఏంటని ప్రశ్నించారు. జయలలితే బతికుంటే అసలు వాళ్లకు తన ఆఫీసులో ప్రవేశించే ధైర్యం ఉండేదా అని నిలదీశారు. చీఫ్ సెక్రటరీ చాంబర్లోకి వెళ్లడానికి సీఆర్పీఎఫ్ ఎవరి అనుమతి తీసుకుందని.. ముఖ్యమంత్రి అనుమతి తీసుకున్నారా అని అడిగారు. ఒక చీఫ్ సెక్రటరీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక అన్నాడీఎంకే కార్యకర్తల గతేంటని అన్నారు. వాళ్లు తన ఇంటిని సోదా చేయాలనుకుంటే ముందు తనను బదిలీ చేయాలని, అందుకు కేవలం రెండు నిమిషాలు చాలని అన్నారు. చీఫ్ సెక్రటరీ స్మగ్లర్, టెర్రరిస్టు అని, ఆయన తమకొద్దని చెప్పి బదిలీ చేయమని కేంద్రానికి చెబితే కేంద్రం రెండు నిమిషాల్లో తనను బదిలీ చేసేదన్నారు. అమ్మ బతికుంటే ఇలా జరిగుండేది కాదని, ఇప్పుడు తమిళనాడు ప్రజల భద్రత మాటేంటని అన్నారు. తను 75 రోజుల పాటు ఆమె ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చానని, ఆమె మరణించిన తర్వాత తుపాను వస్తే, ఆ సమయంలో కూడా తానే బాధ్యతలు చూసుకున్నానని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఎవరికీ భద్రత లేదని చెప్పారు. తమిళనాడులో మిలటరీ, సీఆర్పీఎఫ్ ప్రవేశించి ఏమైనా చేయగలవని, వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అంటే గౌరవం లేదని అన్నారు.