అమ్మ ఆస్తులు ఎవరికి?

12 Dec, 2016 14:45 IST|Sakshi
అమ్మ ఆస్తులు ఎవరికి?

చెన్నై: నంబర్‌ 81, వేదా నిలయం, పోయెస్ గార్డెన్‌.. తమిళనాట రాజకీయానికి ఈ చిరునామా బలమైన అడ్డా. దాదాపు పాతికేళ్లు తమిళనాడులో అసలైన రాజకీయాలు ఈ చోటు నుంచే ప్రారంభమయ్యాయి. ఎప్పుడో తమిళనాడు ముఖ్యమత్రి జయలలిత తల్లి సంధ్య 1967లో రూ.1.32లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఈ ఆస్తిని తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు జయ ఉపయోగించుకున్నారు. పోస్ గార్డెన్‌ అనగానే చుట్టుపక్కలవారికి బలమైన రాజకీయ శక్తికి నిలయం అని గుర్తించేలా చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అంచనా ప్రకారం ఈ ఎ‍స్టేట్‌ విలువ ఇప్పుడు దాదాపు రూ.90కోట్లపై మాట.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన తర్వాత ప్రస్తుత పరిస్థితులు సర్దుమణిగేలా చేసేందుకు పార్టీ పగ్గాలు జయ ప్రాణ స్నేహితురాలు శశికలకు, సీఎం పదవి జయ విశ్వసనీయుడైన పన్నీర్‌ సెల్వంకు అప్పగించారు. అయితే, అమ్మ ఆస్తులకు ఎవరు వారసులుగా ప్రకటించబడతారనే విషయం పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో ఏనాడు తన తర్వాత ఎవరూ అనే విషయాన్ని జయ ప్రకటించలేదు. ఆమె అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు సైతం ఒక వీలునామా అంటూ రాయలేదు.

దీంతో ఇప్పుడు ఆ ఆస్తులు ఎవరికీ కేటాయిస్తారనే అంశం ఉత్కంఠగా మారింది. ప్రధానంగా పరిశీలించినప్పుడు జయ స్నేహితురాలు శశికళ నటరాజన్కు వేదా నిలయంలో శాశ్వతంగా ఉండే హక్కు వస్తుందా లేక ఆమె మేనకోడలు దీపా జయకుమార్‌, సోదరుడు దీపక్‌ లకు ఈ అవకాశం వస్తుందా అని ఒక ప్రశ్న తలెత్తుతుండగా.. జయ రాజకీయ గురువు ఎంజీ రాంచంద్రన్‌కు రామాపురం, చెన్నైలో ఉన్న ఇళ్ల మాదిరిగానే చట్టపరమైన వివాదాల్లో చిక్కి ఇప్పటికీ ఎవరికీ దక్కనట్లుగానే అలాగే ఉండిపోతుందా అనేది మరో ప్రశ్న. జయలలిత అంతిమ సంస్కారాలను పూర్తి చేసిన శశికళ అనంతరం నేరుగా వేద నిలయానికి వెళ్లారు. వాస్తవానికి పోయెస్ గార్డెన్‌ను జయలలిత, ఆమె తల్లి సంధ్య కలిసి కొనుగోలు చేసినందున తమ నాయనమ్మ ఆస్తిలో వాటా వస్తుందని జయ మేనళ్లుడు, మేనకోడలు అడిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.

మరిన్ని వార్తలు