తొమ్మిది నెలల ప్రసూతి సెలవు..!

1 Sep, 2016 20:14 IST|Sakshi
తొమ్మిది నెలల ప్రసూతి సెలవు..!

చెన్నైః మరో ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు తమిళనాడులోని ఏఐడిఎంకే ప్రభుత్వం ముందుకొచ్చింది. మాతృత్వ ప్రయోజనాలను అమలు చేయడంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల ప్రసూతి సెలవును ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలకు పొడిగించింది.

2011 లో మా ప్రభుత్వం ప్రసూతి సెలవును 90 రోజులనుంచి, ఆరు నెలలకు పెంచిందని, ఇప్పుడు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు వరకూ పెంచుతున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జె జయలలిత రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్సత్రుల్లో కోట్ల రూపాయల మెగా ప్రణాళికలను అమలు చేయనున్నట్లు తెలిపారు. మథురై లోని రాజాజి ప్రభుత్వ ఆస్పత్రి, చెన్నైలోని కీల్పాక్ గవర్నమెంట్ హాస్పిటల్, కోయంబత్తూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ లో పిల్లలకు వాస్కులర్, కార్డియో థొరాసిక్, ప్లాస్టిక్ సర్జరీ, కిడ్నీ, ఈఎన్టీ ఆపరేషన్ సౌకర్యాల ఏర్పాటుకోసం మరిన్ని భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదించారు.  

సేలం, వెల్లూర్, తంజావూర్, తిరునల్వేలి, తిరుచ్చి, టుటికోరిన్ లలోని సాధారణ ఆసుపత్రుల్లో 75.10 కోట్ల వ్యయంతో మెమోగ్రఫీ, సీటీ స్కాన్, ఇమేజింగ్, అల్ట్రా సౌండ్, ఇతర సామగ్రులను అందించి అప్ గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. మొత్తంమీద అనేక చిన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహా 131,43 కోట్ల వ్యయంతో సదుపాయాలను మెరుగు పరచనున్నట్లు నూతన ప్రణాళికలను ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు