జయలలిత ఆస్పత్రి దృశ్యాలు నకిలీవి

31 Jul, 2018 03:58 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జ్యూస్‌ తాగినట్లుగా ప్రచారంలోకి వచ్చిన వీడియో పూర్తిగా నకిలీదని విచారణ కమిషన్‌ తేల్చింది. జయలలిత మృతి మిస్టరీపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముస్వామి చైర్మన్‌గా ఏర్పాటు చేసిన కమిషన్‌ ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా కమిషన్‌ కార్యదర్శి కోమల ఆదివారం జయ చికిత్స పొందిన అపోలో ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. ప్రత్యేక గదిలో టీవీ చూస్తూ జయలలిత జ్యూస్‌ తాగుతుండగా శశికళ చిత్రీకరించినట్లుగా చెబుతున్న వీడియోపై అక్కడ పరిశీలన జరిపారు. జయ పడుకున్న మంచానికి ఎదురుగా ద్వారం మాత్రమే ఉంది. టీవీ అమర్చేందుకు అవకాశమే లేదని గుర్తించారు. దీని ప్రకారం జయ జ్యూస్‌ తాగుతున్న దృశ్యాలు నకిలీవని తేలినట్లు కోమల వివరించారు. ఇంకా అనేక కోణాల్లో చేపట్టిన దర్యాప్తులోనూ అవి డూప్లికేట్‌వని రుజువైందన్నారు.

మరిన్ని వార్తలు