తమిళనాడు సీఎంగా జయ ప్రమాణ స్వీకారం

23 May, 2015 12:01 IST|Sakshi
తమిళనాడు సీఎంగా జయ ప్రమాణ స్వీకారం

చెన్నై : అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. శనివారం ఉదయం 11.08 గంటలకు ఆమె ముఖ్యమంత్రిగా తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రోశయ్య మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయ గద్దెనెక్కడం ఇది అయిదోసారి. అనంతరం  ఆర్థికమంత్రిగా పన్నీర్ సెల్వం, విద్యుత్ మంత్రిగా నాథమ్ ఆర్ విశ్వనాథన్, గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఆర్.వైదిలింగం ప్రమాణం చేశారు. కీలకమైన హోం, పోలీసు, పబ్లిక్, ఆల్ ఇండియా సర్వీసెస్, సాధారణ పాలన వంటి శాఖలను జయ తన వద్దే ఉంచుకున్నారు.

జయలలితతో పాటు 28మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషిగా తేలడం, ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకోవడంతో కిందటేడాది సెప్టెంబర్ 29న పన్నీర్ సెల్వన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాగా   ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఈనెల 11న జయను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, పార్టీ నేతలు హాజరయ్యారు.

అంతకు ముందు జయలలిత ప్రమాణ స్వీకారానికి పోయెస్ గార్డెన్ నుంచి మద్రాస్ యూనివర్శిటీకి వెళుతుండగా అభిమానులు, కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపుల నిలబడి అమ్మకు ఘన స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు