జయలలిత కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

5 Apr, 2017 15:58 IST|Sakshi
జయలలిత కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. ఈ కేసులో జయలలితను దోషిగా తేల్చాలంటూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది.  జయలలితను దోషిగా ప్రకటించలేమని సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ కర‍్ణాటక సర్కార్‌ పిటిషన్‌ ను కొట్టివేసింది.

ఈ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు... జయలలిత మినహా శశికళతో పాటు మిగతావారిని దోషులుగా తేల్చిన విషయం విదితమే. కాగా  జయలలిత అక్రమాస్తుల కేసులో రూ.100 కోట్ల అపరాధ సొమ్మును వసూలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. అయితే అనారోగ్యంతో జయలలిత మృతి చెందడంతో ఆమె శిక్షను రద్దు చేసున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు అదే సమయంలో అపరాధ రుసుం రూ.100 కోట్లను వేరే రూపంలో వసూలు చేయాలని ఉత్తర్వులిచ్చింది.

ఇదిలావుండగా ఈ తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ముద్దాయి చనిపోయిన నేపథ్యంలో జయలలితకు విధించిన అపరాధ రుసుం వసూలు చేసేందుకు రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదనేది ఈ పిటిషన్‌ సారాంశం. ఈ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

కాగా జయలలిత ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో కోర్టు ఆదేశాల మేరకు జయలలిత, శశికళ, ఇళవరసి, దివాకరన్ల నుంచి కర్ణాటక ప్రభుత్వం రూ. 130 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే జయలలిత మరణించడంతో ఆమెకు చెందిన ఆస్తులను వేలం వేసి రూ. 100 కోట్ల అపరాధ రుసుం వసూలు చేయాలి. అలాగే  శశికళ, ఇళవరసి, దివాకరన్ ల నుంచి రూ.30 కోట్ల అపరాధరుసుం వసూలు చేయాలి. మరోవైపు ఈ కేసులో దోషిగా ఉన్న శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో ఉన్నారు.

మరిన్ని వార్తలు