అమ్మ ఆస్తులు ప్రజలకే..!

2 Oct, 2014 01:41 IST|Sakshi
అమ్మ ఆస్తులు ప్రజలకే..!

- అన్నాడీఎంకే అధినేత్రి జయ వెల్లడి
- న్యాయస్థానంలో అమ్మ వ్యాఖ్యానించినట్లుగా తమిళ పత్రికల కథనం

చెన్నై, సాక్షి ప్రతినిధి : ‘కుటుంబమే లేని నాకు కోట్లాది రూపాయల అక్రమార్జన అవసరమేమీ, ప్రజలే నా ఆస్తి, నా ఆస్తి అంతా ప్రజలకే’...ఈ మాటలు అన్నది ఎవరో కాదు, అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత. బెంగళూరు కోర్టులో తీర్పు వెలువడిన వెంటనే న్యాయమూర్తి సమక్షంలో జయ ఈ వ్యాఖ్యలు చేసినట్లు బుధవారం ఓ తమిళ పత్రికలో కథనం వెలువడింది. జయ తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాను పొందిన రోజుల్లో (1991-96) భారీగా అక్రమార్జన చేసినట్లు జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి ఆ తరువాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిటిషన్‌పై ఏసీబీ అధికారులు విచారణ జరిపి రూ.66.44 కోట్లు అక్రమార్జనగా లెక్కతేల్చి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 18 ఏళ్లపాటు సాగిన ఈ కేసుపై గత నెల 27వ తేదీన తీర్పు వెలువడింది. సీఎం హోదాను అడ్డం పెట్టుకుని ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు రుజువైందని న్యాయస్థానం అభిప్రాయపడింది. జయతో సహా మొత్తం నలుగురికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.

తీర్పు వెలువరించే సమయంలో ముద్దాయిలు, సంబంధిత న్యాయవాదులు, న్యాయమూర్తులు మినహా ఇతరులెవ్వరినీ కోర్టులోకి అనుమతించలేదు. కోర్టు ముగిసిన తరువాత వారూ వీరు ఇచ్చిన సమాచారంపైనే అందరూ ఆధారపడ్డారు. కోర్టు తీర్పు వెలువడగానే జయ బృందాన్ని బెంగళూరులోని కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ నాలుగు రోజుల్లో జయను జైల్లో కొందరు ముఖ్యులు కలుసుకున్నారు. వీరి ద్వారా సేకరించిన సమాచారాన్ని ఓ తమిళ దినపత్రిక ప్రచురించింది. అందులోని వివరాలు
ఇలా ఉన్నాయి....
 
‘నేను స్వతహాగా ఆస్తిపరురాలిని, సినీ నటిగా ఎంతో సంపాదించాను. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే నాకు మంచి ఆస్తి ఉంది. నాకంటూ ఓ కుటుంబమే లేనప్పుడు అక్రమంగా ఆర్జించాల్సిన అవసరం ఏముంది. నాకున్న ఆస్తి అంతా తమిళనాడు ప్రజలే. అందుకే నాకున్న ఆస్తినంతా తమిళనాడు ప్రజలకే అంకితం చేస్తాను. ప్రజాకోర్టులో నన్ను ఢీకొనలేని కొందరు వ్యక్తులు కుట్రపన్ని ఈ కోర్టుద్వారా అక్రమ కేసులను బనాయించి ప్రతీకారం తీర్చుకున్నారు’ అంటూ తీర్పువెలువడిన అనంతరం న్యాయమూర్తికి జయ విన్నవించుకున్నట్లు ఆ పత్రిక కథనంలో పేర్కొంది.

మరిన్ని వార్తలు