జయ తండ్రి మృతి కూడా మిస్టరీనే!

5 Dec, 2017 02:59 IST|Sakshi

జయరామన్‌ను భార్య సంధ్యనే చంపేసింది

జయకు కుమార్తె ఉంది.. బిడ్డ తండ్రెవరో తెలియదు

జయలలిత అత్త లలిత సంచలన వ్యాఖ్య

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జీవించి ఉన్నపుడే కాదు మరణించిన తరువాత కూడా ఆమె జీవితం అనేక మలుపులు తిరుగుతోంది. జయ తండ్రి జయరామన్‌ ఆయన భార్య సంధ్య చేతిలోనే హత్యకు గురయ్యాడనే సంచలన వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది.

జయ తండ్రిది హత్యే!
వివాదాస్పదంగా మారిన జయ జీవితంపై బెంగళూరులో నివసిస్తున్న ఆమె అత్త లలిత ఇటీవల తమిళ చానల్‌ సన్‌న్యూస్‌తో మాట్లాడారు. జయకు ఒక ఆడశిశువు జన్మించిన మాట వాస్తవమేనని, తన పెద్దమ్మే ఆమెకు పురుడుపోసిందని చెప్పారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని జయలలిత తమతో ప్రమాణం చేయించుకున్నారన్నారు. అయితే, సదరు అమృతనే ఆమె కుమార్తె అని చెప్పడానికి తన వద్ద ఆధారమేదీ లేదన్నారు. జయ తండ్రి జయరామన్‌ మద్యానికి బానిస కావటంతో దూరంగా ఉంచారని, అతనికి తల్లి సంధ్యే విషమిచ్చి చంపినట్లు లలిత ఆరోపించారు.

జయ ఈగోను భరించలేక, జయరామన్‌ హత్య వంటి సంఘటనలతో తామంతా దూరంగా వెళ్లిపోయామన్నారు. జయలలిత తండ్రి జయరామన్, సంధ్య దంపతులకు జయలలిత, జయకుమార్‌ సంతానం. స్వతహాగా సినీ నటి అయిన సంధ్య జయలలితను సైతం వెండితెర వైపునకు ప్రోత్సహించింది. ఆమె ఉన్నతిలో తల్లి సంధ్య ముఖ్య పాత్ర పోషించింది. జయలలిత ఆకస్మిక మరణంతో ఒక్కసారిగా అనేక వివాదాలు తెరపైకి వచ్చాయి. వీటిలో అన్నిటికంటే ముఖ్యమైంది

గోప్యంగా సాగిన ఆమె వ్యక్తిగత జీవితం.
అజ్ఞాతంలో అమృత: శోభన్‌బాబుతో జయ సహజీవనం చేశారని వారికి కుమార్తె కూడా ఉందనే ప్రచారం జయ మరణం తరువాత జోరందుకుంది. ఇద్దరు యువతులు, ఒక యువకుడు తాము జయ సంతానం అంటూ చెప్పుకోవడం ప్రారంభించారు. కోర్టు కొరడా ఝుళిపించడంతో ఇద్దరు వెనక్కి తగ్గగా బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి మాత్రం..సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. డీఎన్‌ఏ పరీక్షలకు సైతం సిద్ధం అని, జయ భౌతిక కాయాన్ని సమాధి నుంచి బయటకు తీసి పరీక్షలు జరపండంటూ సవాల్‌ చేశారు. అయితే, ముందుగా రాష్ట్రస్థాయిలో పరిష్కరించు కోవాలంటూ సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ వేసేందుకు సిద్ధమైన తరుణంలో తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నట్లు అమృత తెలిపారు. ఈ నేపథ్యంలోనే అమృత అజ్ఞాతంలోకి వెళ్లారని, త్వరలో కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ వేస్తారని సమాచారం.

మరిన్ని వార్తలు