పనిలో నాణ్యత పాటించనందుకు జనాల ఎదుటే పనిష్మేంట్‌

6 Jun, 2019 16:09 IST|Sakshi

భువనేశ్వర్‌ : కొత్తగా ఎన్నికైన బీజేడీ నాయకుడు ఒకరు ప్రభుత్వ ఇంజనీరు చేత ప్రజల ముందు గుంజీళ్లు తీయించి.. వివాదంలో చిక్కుకున్నారు. వివరాలు.. ఒడిషా పట్నాగఢ్‌ నుంచి బీజేడీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సరోజ్‌ కుమార్‌ మెహర్‌ ఓ ఇంజనీరు చేత జనాల ముందు 100 గుంజీళ్లు తీయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే సదరు ఎమ్మెల్యే ఇంత కఠిన చర్యలు తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది. తన నియోజకవర్గంలో రోడ్ల నాణ్యత..  ప్రమాణాలకు తగినట్లుగా లేకపోవడంతో ఆగ్రహించిన సరోజ్‌ కుమార్‌ అందుకు బాధ్యుడైన ఇంజనీర్‌ని పిలిపించాడు.

రోడ్ల నాణ్యత విషయంలో ప్రమాణాలు పాటించనందుకు గాను సదరు ఇంజనీర్‌ జనాల ముందు 100 గుంజీళ్లు తీయాల్సిందిగా సరోజ్‌ ఆదేశించాడు. ఒక వేళ తాను చెప్పినటు చేయకపోతే.. తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని బెదిరించాడు. దాంతో సదరు ఇంజనీర్‌ గుంజీళ్లు తీస్తూ.. పనిలో నాణ్యత పాటించనందుకు క్షమాపణలు తెలిపాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియో పట్ల ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. నెటిజన్లు మాత్రం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు తగిన బుద్ధి చెప్పారని ఎమ్మెల్యేను పొగుడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో స్థానిక చానెళ్లలో కూడా ప్రసారమవుతుంది.

>
మరిన్ని వార్తలు