మోదీ కాదు.. నితీష్‌ ప్రధాని అయితేనే

9 May, 2019 19:07 IST|Sakshi

పట్నా : మరోసారి కేంద్రంలో ఎన్డీయే అధికారాన్ని చేపట్టాలంటే బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ ప్రధాని పీఠం అధిరోహించాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ గులామ్‌ రసూల్‌ బలియావి అభిప్రాయపడ్డారు. ఈ సారి ఎన్నికల్లో ఎన్డీయేకి మెజారిటీ రాదని జోస్యం చెప్పారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కాకుండా నితీష్‌వైపు మొగ్గు చూపితేనే ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందని అన్నారు. అదేవిధంగా.. బిహార్‌ ప్రజలు నితీష్‌ పనితీరు వల్లనే ఎన్డీయే పక్షాన నిలబడుతున్నారని.. ప్రధాని మోదీ వల్ల కాదని చెప్పుకొచ్చారు. రసూల్‌ వ్యాఖ్యలతో మరోసారి నితీష్‌ ప్రధాని అభ్యర్థిత్వంపై చర్చలు మొదలయ్యాయి. అయితే, ఎమ్మెల్సీ కామెంట్లను నితీష్‌ కొట్టిపారేశారు. 40 ఎంపీ సీట్లున్న బిహార్‌లో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 7 దశల్లో పోలింగ్‌ జరుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలాఉండగా.. జేడీయూ సీనియర్‌ నేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ గత ఫిబ్రబరిలో నితీష్‌ ప్రధాని అభ్యర్థిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్డీయేకు సరిపడా మెజారిటీ వస్తుంది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అవడం ఖాయం. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఎన్డీయేలో టాప్‌ లీడర్‌. గత పదేహేనేళ్లుగా సీఎంగా ఉన్న వ్యక్తికి ప్రజల్లో గొప్ప పాపులారిటీ ఉంటుంది.  అయితే, నితీష్‌ను ప్రధాని రేసులోకి లాగటం మంచిది కాదు. ఒకవేళ ఎన్డీయేకు సంపూర్ణ మెజారీటీ రాకపోయినా.. నితీష్‌ను ప్రధాని రేసులో ఉన్నారని మాట్లాడటం అంత మంచిది కాదు’ అని అన్నారు.

మరిన్ని వార్తలు