ఏదేమైనా బీజేపీకి మద్దతివ్వం: జేడీయూ

15 Dec, 2018 12:22 IST|Sakshi
ప్రశాంత్‌ కిశోర్‌, నితీశ్‌కుమార్‌ (ఫైల్‌)

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి బీజేపీ ఆర్డినెన్స్‌ తీసుకొస్తే మద్దతిచ్చేది లేదని బీజేపీ మిత్రపక్షం, బిహార్‌ అధికార పార్టీ జనతాదళ్‌(యూ) స్పష్టం చేసింది. మందిర నిర్మాణానికి తెచ్చే ఎటువంటి ఆర్డినెన్స్‌నైనా సమర్థించేది లేదని జేడీయూ సంస్థాగత జనరల్‌ సెక్రటరీ ఆర్సీపీ సింగ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ కిశోర్‌ తెలిపారు. ఇదిలా ఉండగా.. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టి తీరుతామని బీజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జేడీయూ భిన్న వైఖరి చర్చనీయాంశమైంది. సామాజిక సంబంధాలు, మత సామరస్యానికే తమ పార్టీ కట్టుబడి ఉందని ఆర్సీపీ సింగ్‌ తెలిపారు. కాగా, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై జేడీయూ నాయకత్వం మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి.

ప్రశాంత్‌ కిషోర్‌ మాట్లాతుతూ.. ‘అయోధ్య అంశం లేవనెత్తకుండానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగలదు. 2014 ఎన్నికల సమయంలో ఉన్న పాపులారిటీ బీజేపీకి ఇప్పుడు లేదు. అయినా వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తుంద’ని ఆశాభావం వ్యక్తం చేశారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉందని అన్నారు. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో అశేష ప్రజాదరణతో అధికారంలోకొచ్చిన కాషాయ పార్టీ ప్రతిష్ట రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. 

మరిన్ని వార్తలు