జేఈఈ ఫలితాలు : మరో 13,842 మంది అర్హులు

14 Jun, 2018 19:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌ 2018 అర్హుల సంఖ్య పెరిగింది. తొలుత ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫలితాలకు అదనంగా మరికొంత మంది అర్హుల జాబితాను గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ కాన్పూర్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదివారం విడుదలైన ఫలితాల్లో 18,138 మంది అర్హత సాధించారు. తాజాగా అనుబంధ(సప్లిమెంటరీ) మెరిట్‌ జాబితాలో 13,842 మంది అదనంగా అర్హత సాధించినట్టు పేర్కొన్నారు. అంటే మొత్తం 31,980 మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు పొందనున్నారు.

గత ఏడేళ్లతో పోలిస్తే ఈ ఏడాదే తక్కువ మంది అర్హత సాధించడంతో కేంద్ర మానవ వనరులు శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. భారీగా ఐఐటీ సీట్లు ఉండటం, ఒక్కో సీటుపై కేంద్ర ప్రభుత్వం భారీగా వెచ్చిస్తుండటంతో.. కొత్త మెరిట్‌ లిస్ట్‌ను రూపొందించాల్సిందిగా ఐఐటీ కాన్పూర్‌కు సూచించింది. ఈ సందర్భంగా కేంద్ర మానవ వనరులు శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఐఐటీ సీట్లు ఖాళీగా ఉండటానికి వీల్లేదన్నారు.. ప్రభుత్వం ఐఐటీల కోసం భారీగా ఖర్చు చేస్తుందని గుర్తుచేశారు. దీంతో కట్‌ ఆఫ్‌ తగ్గించిన ఐఐటీ కాన్పూర్‌ కొత్త జాబితాను రూపొందించింది. అయిన్పటికీ గతేడాదితో పోల్చితే ఇది తక్కవే అని చెప్పాలి. 2017లో 50,455 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించారు. ఈ ఏడాది మే 20న నిర్వహించిన ఈ పరీక్షకు 1,55,158 మంది విద్యార్థులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు