ఆగస్టు 23న జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

8 May, 2020 02:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఆగస్టు 23వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. మే 17న జరగాల్సిన ఈ పరీక్ష లాక్‌డౌన్‌ వల్ల వాయిదా పడింది. జేఈఈ–మెయిన్స్‌ పరీక్షలను జూలై 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు పూర్తయ్యాక 10–15 రోజుల్లో ఫలితాలను వెల్లడించనున్నారు.

టాప్‌ మార్కులు సాధించిన 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కల్పించనున్నారు. ఆ దరఖాస్తులకు నాలుగైదు రోజుల సమయం ఇస్తారు. ఆగస్టు 23న పరీక్ష నిర్వహించి వీలైనంత త్వరగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ తరువాత జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఇంజనీరింగ్‌ తరగతులను ప్రారంభించేలా ఇటీవల ఏఐసీటీఈ అకడమిక్‌ షెడ్యూల్‌ ప్రకటించింది.   

‘పీఎం రీసెర్చ్‌ ఫెలోషిప్‌ స్కీమ్‌’లో సవరణలు  
దేశంలో పరిశోధనలను మరింతగా ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి రీసెర్చ్‌ ఫెలోషిప్‌ స్కీమ్‌లో పలు సవరణలు చేసినట్లు రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ వెల్లడించారు. ఈ ఫెలోషిప్‌ పొందడానికి అవసరమైన నిర్దేశిత గేట్‌ స్కోర్‌ తగ్గించినట్లు పేర్కొన్నారు. దీన్ని 750 నుంచి 650కి తగ్గినట్లు స్పష్టం చేశారు. అలాగే లేటరల్‌ ఎంట్రీ అనే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. పీఎంఆర్‌ఎఫ్‌ అనుమతి పొందిన విద్యాసంస్థల్లో పీహెచ్‌డీ చేస్తున్న అభ్యర్థులు ఈ ఫెలోషిప్‌ కోసం లేటరల్‌ ఎంట్రీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు