మే 19న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 

15 Oct, 2018 01:32 IST|Sakshi

ఐఐటీ కౌన్సిల్‌ నిర్ణయం

ఐఐటీ రూర్కీకి పరీక్ష నిర్వహణ బాధ్యత అప్పగింత

అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్‌డ్‌ వెబ్‌సైట్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం 2019 మే 19న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించాలని ఐఐటీ కౌన్సిల్‌ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్ష నిర్వహణ బాధ్యతను ఐఐటీ రూర్కీకి అప్పగించింది. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను పూర్తిగా ఆన్‌లైన్లోనే నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కోసం వెబ్‌సైట్‌ను ( jeeadv. ac. in) అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తుల స్వీరణ, పరీక్ష ఫీజు తదితర పూర్తి వివరాలతో నోటిఫికేషన్‌ను త్వరలోనే జారీ చేస్తామని పేర్కొంది. ఈసారి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్‌ను రెండుసార్లు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

మొదటి దఫా పరీక్షలను 2019 జనవరి 6 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది. వాటి ఫలితాలను అదే నెల 31 నాటికి వెల్లడించనుంది. రెండో దఫా పరీక్షలను 2019 ఏప్రిల్‌ 6 నుంచి 20 వరకు నిర్వహించి ఫలితాలను ఏప్రిల్‌ 30 నాటికి విడుదల చేయనుంది. మొత్తానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులను మే 1 నుంచి ప్రారంభించనుంది. రెండు దఫాల్లో జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకోనుంది. వారి నుంచి దరఖాస్తులను స్వీకరించిన అనంతరం మే 19న పరీక్ష నిర్వహించనుంది. అందులో పేపర్‌–1, పేపర్‌–2కు హాజరైన అభ్యర్థులకే ర్యాంకులను ఇవ్వనుంది. వాటి ఆధారంగా జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలతోపాటు ఐఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. ఈ నెలాఖరులోగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తుల షెడ్యూల్‌తోపాటు ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీ షెడ్యూల్‌ విడుదల కానుంది. గతేడాది దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసేందుకు 2.24 లక్షల మంది అర్హత సాధించారు. జేఈఈ మెయిన్‌లో టాప్‌ మార్కులు సాధించిన 2.24 లక్షల మందిలో 1.68 లక్షల మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకునే అభ్యర్థుల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌లో ఆ వివరాలను వెల్లడించనుంది.  

మరిన్ని వార్తలు