జేఈఈ పరీక్ష ఫలితాల వెల్లడి

14 Jun, 2019 21:04 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికై ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జేఈఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఫోన్‌ నంబర్‌ రిజిస్టర్‌ చేసుకున్నఅభ్యర్థులందరికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఫలితాలు పంపనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం విడుదలైన ఈ ఫలితాల్లో మహారాష్ట్ర విద్యార్థి ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. బల్లార్‌పూర్‌కి చెందిన కార్తికేయ గుప్తా 372 మార్కులకు గానూ 346 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక అలహాబాద్‌కి చెందిన హిమాన్షు సింగ్‌ రెండో స్థానంలో నిలవగా.. ఢిల్లీకి చెందిన ఈర్చిత్‌ బుబ్నా మూడో ర్యాంకు సాధించాడు. 

అస్సలు ఊహించలేదు..
ప్రతిష్టాత్మక పరీక్షలో టాపర్‌గా నిలవడం పట్ల కార్తికేయ హర్షం వ్యక్తం చేశాడు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌లో సీట్‌ లభిస్తుందని అనుకున్నాను గానీ.. ఏకంగా మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదన్నాడు. రోజుకు 6 నుంచి 7 గంటలు పరీక్ష కోసం సన్నద్ధమైనట్లు తెలిపాడు. సబ్జెక్టు నేర్చుకోవడాన్ని పూర్తిగా ఆస్వాదించినపుడే ఉత్తమైన ఫలితాలు పొందగలమన్నాడు. చదువుకునే సమయంలో సోషల్‌ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నానని పేర్కొన్నాడు. తన ప్రిపరేషన్‌లో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు చంద్రేశ్‌ గుప్తా, పూనం కీలక పాత్ర పోషించారని వెల్లడించాడు. వారి సహకారంతోనే ఇంటర్మీడియట్‌లో 93.7 శాతం మార్కులు సాధించానని పేర్కొన్నాడు. కాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 19న జరగాల్సిన జేఈఈ పరీక్షను.. మే 27న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరీక్ష ఫలితాలను jeeadv.ac.in. తెలుసుకోవచ్చు.

>
మరిన్ని వార్తలు