అతడిని క్షమిస్తున్నాను: సబ్రినా లాల్‌

23 Apr, 2018 13:34 IST|Sakshi
జెస్సికా లాల్‌ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మనుశర్మ (పాత చిత్రం)

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జెసికా లాల్‌ హత్యకేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దోషిగా నిరూపిం​చబడి యావజ్జీవ కారగార శిక్ష అనుభవిస్తున్న మనుశర్మ(41)ను తాను క్షమిస్తున్నట్లు జెసిక సోదరి సబ్రినా లాల్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆమె ఢిల్లీ తీహార్‌ జైలు సంక్షేమ అధికారికి ఒక లేఖ రాశారు. దీనిలో ఆమె మనుశర్మ 12 సంవత్సరాల నుంచి జైలులో ఉన్నాడని, ఈ సమయంలో అతను సేవా సంస్థలకు, జైలులోని ఇతర ఖైదీలకు చాలా సహాయం చేశాడని ఇవన్ని అతడిలో వచ్చిన మార్పును సూచిస్తున్నాయని తెలిపారు. అతడి విడుదల విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు.

ప్రస్తుతం మనుశర్మ తీహార్‌లోని ఓపెన్‌ జైల్లో ఉంటున్నాడు. జైల్లో సత్ప్రవర్తన చూపిన ఖైదీలను ఓపెన్‌ జైలుకు పంపిస్తామని, అందులో భాగంగానే ఆరు నెలల క్రితం అతడిని అక్కడికి తరలించినట్టు తీహార్‌ జైలు డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ కశ్యప్‌ తెలిపారు. సబ్రినా లాల్‌ రాసిన లేఖ గురించి మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. దాని గురించి తనకు ఎటువంటి సమాచారం తెలియదని తెలిపారు. ప్రస్తుతం సిద్ధార్థ వశిష్ట అలియాస్‌ మనుశర్మ తన పేరు మీద ఒక సంస్థను స్థాపించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఖైదీలకు, వారి పిల్లలకు పునారావాసం కల్పిస్తున్నారు.

ఒక ప్రైవేటు బార్‌లో పనిచేస్తున్న జెసికా లాల్‌ 1999లో హత్యకు గురయ్యారు. జెసిక మరణించిన రోజు మనుశర్మ మాజీ మంత్రి వినోద్‌ శర్మ కుమారుడితో కలిసి ఆమె పనిచేస్తున్న బార్‌కు వెళ్లాడు. ఆ రోజు జెసికను మద్యం తీసుకురమ్మని మనుశర్మ ఆదేశించాడు. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో ఆమె నిరాకరించింది. ఆ కోపంలో జెస్సికను పాయింట్‌ బ్లాంక్‌ రెంజ్‌లో తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు మనుశర్మ మీద కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేశారు.


జెస్సికా లాల్‌ (ఫైల్‌ ఫొటో)

ట్రయల్‌ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు రేగాయి. దాంతో 2006లో ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. కింది కోర్టులో నిర్లక్ష్యం చేసిన సాక్ష్యాలను పరిశీలించిన తరువాత హైకోర్టు మనుశర్మ నేరం చేశాడని నిర్ధారించి, శిక్ష విధించింది. సుప్రీంకోర్టు ఈ తీర్పును ధ్రువీకరించింది. అప్పటి నుంచి మనుశర్మ జైలు జీవితం గడుపుతున్నారు. జైలులో ప్రత్యేక వసతులు పొందుతున్నారనే ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి.

అరెస్టైన నాటి నుంచి దాదాపు 15 ఏళ్ల జైలు జీవితంలో మనుశర్మకు మూడుసార్లు పెరోల్‌ లభించింది. 2009లో తన నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఒకసారి, 2011లో తన సోదరుని వివాహానికి హజరుకావడానికి, 2013లో తన మాస్టర్స్‌ డిగ్రీ పరీక్షల నిమిత్తం పెరోల్‌ తీసుకున్నారు.

మరిన్ని వార్తలు