రాజకీయ అస్థిరతకు తెరపడేనా?

30 Nov, 2014 01:18 IST|Sakshi

జార్ఖండ్ ఏర్పడిన 14 ఏళ్లలో మారిన 9 ప్రభుత్వాలు
ఈసారి అభివృద్ధి నినాదంతో ముందుకొచ్చిన పార్టీలు

సాక్షి, నేషనల్ డెస్క్: దేశంలోని సుమారు 40 శాతం ఖనిజ సంపద... భారీగా విస్తరించిన అడవులు...జంషెడ్‌పూర్, బొకారో, రాంచీ వంటి పారిశ్రామిక నగరాలు ఆ రాష్ట్రం సొంతం. కానీ అభివృద్ధికి మాత్రం ఆ రాష్ట్రం ఆమడదూరం. ఆ రాష్ట్రమే జార్ఖండ్. దేశ 28వ రాష్ట్రంగా 2000 సంవత్సరం నవంబర్ 15న ఏర్పడిన జార్ఖండ్ గత 14 ఏళ్లుగా ఎన్నో సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. జార్ఖండ్ ఆవిర్భవించిన ఏడాదే (2000 సంవత్సరం) పురుడుపోసుకున్న ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్‌లు అభివృద్ధిలో దూసుకుపోతున్నా ‘అడవులతో నిండిన భూభాగం’ అనే అర్థంగల జార్ఖండ్ మాత్రం రాజకీయ అస్థిరత కారణంగా కాలగమనంలో వెనకబడిపోయింది.

గత 14 ఏళ్లలో సగటున ఏడాదిన్నరకు ఒకటి చొప్పున ఇప్పటివరకూ 9 ప్రభుత్వాలు ఏర్పడటం రాష్ట్రంలోని రాజకీయ అస్థిరతకు అద్దం పడుతోంది. ఈ పరిస్థితుల్లో జార్ఖండ్ తన 10వ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలతోపాటు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వంటి ప్రాంతీయ పార్టీలు సైతం ఈసారి తమ ఎన్నికల ప్రచారంలో రాజకీయ సుస్థిరతనే ప్రధాన అంశంగా మార్చుకున్నాయి. అభివృద్ధి నినాదంతో ప్రజల ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ అస్థిరతకు ప్రధాన కారణాలను పరిశీలిస్తే...
 
ప్రాంతీయ పార్టీల ప్రభావం...
జార్ఖండ్ రాజకీయాల్లో తొలి నుంచీ ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా శిబూ సోరెన్ సారథ్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో చక్రం తిప్పింది. జేఎంఎంతోపాటు జేడీయూ, ఆర్జేడీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జార్ఖండ్ వికాస్ మోర్చా-ప్రజాతంత్రిక్ (జేవీఎం-పీ) వంటి ప్రాంతీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు దీటుగా రాష్ట్రంలో ఎదిగాయి. రాష్ట్రంలోని 50 శాతానికిపైగా ప్రాంతాల్లో గణనీయమైన ప్రభావం చూపగల సామర్థ్యం ఈప్రాంతీయ పార్టీలకు ఉంది. దీంతో గ్రామాల్లో ప్రజలు ఈ పార్టీలవైపు మొగ్గు చూపినా పట్టణాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు పట్టు ఉండటం, అసెంబ్లీలో సీట్ల సంఖ్య 81కే పరిమితం కావడంతో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాని పరిస్థితి నెలకొంది.
 
నాయకత్వ లోపం..రాష్ట్రంలో ఏర్పడిన వరుస ప్రభుత్వాలన్నీ విద్య, వైద్యం, విద్యుత్, రోడ్లు, శాంతిభద్రతల వంటి మౌలిక రంగాలపై దృష్టిపెట్టకపోవడం జార్ఖండ్ అభివృద్ధిని దెబ్బతీసింది. పైగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన శిబూ సోరెన్, మధు కోడాలు కుంభకోణాల్లో చిక్కుకొని జైలుపాలుకావడం కూడా రాష్ట్రానికి ‘బ్రాండ్ ఇమేజ్’ను కల్పించలేకపోయింది.
 నక్సలిజంతో కుదేలు... రాష్ట్రం ఏర్పడే నాటికి రెండు మావోయిస్టు గ్రూపులు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య ఆరుకు చేరింది. దీంతో మావోయిస్టుల కార్యకలాపాలు 8 జిల్లాల నుంచి 22 జిల్లాలకు పెరిగాయి. మావోయిస్టుల హింసలో 350 మంది భద్రతా సిబ్బంది సహా 1,600 మందికిపైగా పౌరులు మృత్యువాతపడ్డారు. ఫలితంగా రోడ్లు, రైలు ప్రాజెక్టుల అభివృద్ధి ముందుకు సాగలేదు. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి 450 మెగావాట్ల నుంచి 300 మెగావాట్లకు పడిపోయింది.
 
అందని వైద్యం, వేధించే నిరక్ష్యరాస్యత..
జార్ఖండ్‌లో నిరక్ష్యరాస్యత రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా మారింది. 2011 సెన్సస్ ప్రకారం సుమారు 3.3 కోట్ల జనాభా గల రాష్ట్రంలో అక్షరాస్యత 54 శాతమే. ఇది దేశ సగటు 65 శాతంకన్నా తక్కువ. దీనికితోడు జనాభాలో 54 శాతం మంది పేదలే ఉన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో వెయ్యి మందికిపైగా వైద్యులకు కొరత ఉన్నట్లు అధికార గణాంకాలు తెలియజేస్తున్నాయి. పైగా రాష్ట్రంలో ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా లేకపోవడం ఇక్కడి వైద్య రంగం దుస్థితి ఏమిటో చెప్పకనే చెబుతోంది.
 
ఓటరు తీర్పు ఎటు?..  గత 14 ఏళ్లు నెలకొన్న రాజకీయ అస్థిరతకు ఈసారైనా తెరపడుతోందో లేదోనని యావత్ దేశం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ఆసక్తిగా చూస్తోంది. అయితే ఈసారి బీజేపీ, జేఎంఎంతోపాటు కాంగ్రెస్‌ల మధ్య ప్రధాన పోటీ నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 30 సీట్లు, కాంగ్రెస్‌కు 15, జేఎంఎంకు 7, జేవీఎంకు 6, ఏజేఎస్‌యూ 6, ఆర్జేడీ 3, జేడీయూ 5, ఎల్‌జేపీ 1 చోట గెలిచే అవకాశం ఉన్నట్లు ఏబీపీ న్యూస్-నీల్సన్ చేపట్టిన తాజా ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఈ అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల అనంతర పరిణామాలపైనే జార్ఖండ్ భవితవ్యం ఆధారపడి ఉంది.

>
మరిన్ని వార్తలు