ముస్లిం ఎమ్మెల్యేతో మంత్రి సంభాషణ; విమర్శలు

26 Jul, 2019 20:20 IST|Sakshi

రాంచి : దేశ వ్యాప్తంగా దళితులు, ముస్లింలు సహా ఇతర మైనార్టీలపై మూకదాడులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.  జై శ్రీరాం నినాదం పేరిట దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వివిధ రంగాల ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌ పట్టణాభివృద్ధి మంత్రి సీపీ సింగ్‌ అసెంబ్లీ బయటే ఓ ముస్లిం ఎమ్మెల్యేను జై శ్రీరాం అనాలంటూ ఒత్తిడి చేయడం సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

జార్ఖండ్‌ శాసన సభ ఆవరణలో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇర్ఫాన్‌ అన్సారీ దగ్గరకు వచ్చిన సీపీ సింగ్‌(బీజేపీ)..ఆయనను గట్టిగా పట్టుకుని..‘ ఇర్ఫాన్‌ భాయ్‌, జై శ్రీరాం అని బిగ్గరగా అరవండి. మీ పూర్వీకులు బాబర్‌ నుంచి కాక రాముడి నుంచి వచ్చారని చెప్పండి. మీకు విఙ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయనతో అన్నారు. ఇందుకు స్పందించిన అన్సారీ...‘ జై శ్రీరాం పేరిట మీరు ప్రజలను భయపెడుతున్నారు. రాముడి పేరును అప్రతిష్టపాలు చేస్తున్నారు. మనకు ఇప్పుడు కావాల్సింది ఉద్యోగాలు, ఎలక్ట్రిసిటీ, నీళ్లు, మురికి కాలువలు అంతే అని బదులిచ్చారు. ఈ క్రమంలో జేపీ సింగ్‌ మాట్లాడుతూ...‘ నేను మిమ్మల్ని భయపెట్టడం లేదండీ. మీ పూర్వీకులు రామనామ స్మరణ చేశారు. తైమూర్‌, బాబర్‌, ఘజిని మీ పూర్వీకులు కాదా ఏంటి. వాళ్లంతా రామ భక్తులేనని గుర్తుపెట్టుకోండి’ అని మరోసారి ఆయనతో వాగ్వాదానికి దిగారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో జేపీ సింగ్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

>
మరిన్ని వార్తలు