పెళ్లికి నిరాకరించిందని రూ.5 లక్షలు తగలబెట్టాడు!

20 Apr, 2018 19:07 IST|Sakshi

సెహోర్‌ : ఓ యువకుడు తాను ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం.. తాను పనిచేస్తున్న కంపెనీ నుంచే 6.74 లక్షలు రూపాయల నగదును దొంగతనం చేశాడు. కానీ ఆ అమ్మాయి, అబ్బాయి ప్రపోజల్‌ను తిరస్కరించడంతో, కోపోద్రిక్తుడైన అబ్బాయి రూ.5 లక్షల నగదును వెంటనే అక్కడిక్కడే తగుల పెట్టేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సోహోర్‌లో చోటుచేసుకుంది. 

జితేంద్ర గోయల్‌(22), ఓ ఫైనాన్స్‌ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా జితేంద్ర ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సంస్థకు చెందిన లాకర్‌ నుంచి ఏప్రిల్‌ 18న రూ.6.74 లక్షల నగదు చోరి చేశాడు. చోరి చేసిన అనంతరం ఆ అమ్మాయిని దగ్గరికి వెళ్లాడు. కానీ ఆమె అబ్బాయి ప్రపోజల్‌ను తిరస్కరించింది. వేరే అబ్బాయితో పెళ్లికి సిద్దమైంది. ఎవరి కోసమైతే ఈ దొంగతనం చేశానో వాళ్లే తనకు దక్కనప్పుడు ఈ నగదు ఎందుకు అని? తీవ్ర కోపోద్రోక్తంతో బ్యాగులో నుంచి రూ.5 లక్షలను తీసి కాల్చి బూడిద చేశాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో బయటపడ్డాయి. సంస్థ నుంచి నగదు చోరికి గురైందని ఆ సంస్థ మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. 

జితేంద్ర స్వస్థలం హార్ద జిల్లా అని, ఈ దొంగతనం చేసిన 24 గంటల్లో జితేంద్రను తాము పట్టుకున్నట్టు సెహోర్‌ స్థానిక పోలీసు స్టేషన్‌ ఇన్‌-ఛార్జ్‌ నిరంజన్‌ శర్మ తెలిపారు. దొంగతనం ఎందుకు చేశాడో విచారించే సమయంలో ఇవన్నీ బయట పడినట్టు తెలిసిందని శర్మ చెప్పారు. కాల్చేసిన రూ.5 లక్షల నగదులో ఎక్కువగా రూ.500 నోట్లే ఉన్నాయని, మరో రూ.46వేలు, రూ.1,28,000 కప్‌బోర్డులో దొరికినట్టు  పోలీసులు తెలిపారు. జితేంద్రకు వ్యతిరేకంగా ఐపీసీ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు