కాంగ్రెస్‌ నేత జీతు పట్వారీ వివాదాస్పద వ్యాఖ్యలు

25 Jun, 2020 10:02 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నాయకుడు భారతీయ జనతా పార్టీని విమర్శించబోయి తానే స్వయంగా చిక్కుల్లో పడ్డారు. దీంతో జాతీయ మహిళా కమిషన్‌ ఆయన మీద కేసు నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌ మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జీతు పట్వారీ బుధవారం 2014,19 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపయోగించిన ‘సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్’‌ నినాదాన్ని విమర్శించే ఉద్దేశంతో.. ‘ప్రజలు ఒక కొడుకు కోసం ఆశతో ఉన్నారు. కాని వారికి లభించింది ఐదుగురు కుమార్తెలు. కూతుళ్లందరూ జన్మించారు కాని వికాస్ అనే కుమారుడు ఇంకా పుట్టలేదు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇక్కడ వికాస్‌(అభివృద్ధి)ని కుమారుడితో పోల్చగా.. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి పథకాలను కుమార్తెలుగా పోల్చారు. దాంతో నెటిజనులు జీతు పట్వారీని విపరీతంగా ట్రోల్‌ చేశారు. (‘విపత్తు వేళ చౌకబారు రాజకీయాలు’)

అయితే జరగాల్సిన నష్టం అంతా జరిగాక మేల్కొన్న జీతు పట్వారీ.. కుమార్తెలను తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని.. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతింటే అందుకు తాను చింతిస్తున్నానని  క్షమించమని కోరారు. కుమార్తెలను తాను దైవంగా భావిస్తానని తెలిపారు. అంతేకాక మోదీ నోట్లరద్దు, జీఎస్టి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మాంద్యంతో  దేశ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచారన్నారు. ప్రజలు వీటన్నింటిని అభివృద్ధి ఆశతో మాత్రమే భరించారని తెలిపారు. బీజేపీ బలహీనతలను ఎత్తి చూడమే తన ఉద్దేశమని.. బీజేపీ నాయకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చలేదని జీతు పట్వారీ ఆరోపించారు.

జీతు పట్వారీపై విరుచుకుపడిన వారిలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఉన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు మహిళలను దారుణంగా అవమానించారని.. దీనికి సోనియా గాంధీ ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం దేశ ప్రజలు రాణి దుర్గావతి త్యాగాన్ని స్మరించుకుంటున్నారని.. ఇలాంటి సమయంలో ‘కొడుకు కోసం ఎదురు చూస్తే.. ఐదుగురు కుమార్తెలు జన్మించారు’ అని వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌ నాయకుల నీచ మనస్తత్వానికి నిదర్శనం అన్నారు. కుమార్తెలు పుట్టడం నేరమా అని చౌహాన్‌ ప్రశ్నించారు. సోనియా గాంధీ.. జీతు పట్వారీకి ఆడవారిని అవమానించే పని అప్పగించారా ఏంటి అని ఆయన విమర్శించారు. (కొత్త సారథి కావలెను)

జీతు పట్వారీ ట్వీట్‌ పట్ల జాతీయ మహిళా కమిషన్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కమిషన్‌ చైర్‌పర్సన్ రేఖా శర్మ ఇందుకు అతను సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ రకమైన మనస్సు ఉన్న వారు తమను తాము నాయకులుగా భావించుకోవడం విచారకరమన్నారు. ఇలాంటి మనస్తత్వంతో వారు తమ అనుచరులకు ఏం బోధిస్తున్నారు అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు