కుంగిపోతున్నాం..!

4 Sep, 2018 03:14 IST|Sakshi

పిల్లలు, అత్తామామలకు అబద్ధాలు చెప్పాల్సి వస్తోంది

మానసికంగా కుంగిపోతున్నాం

కశ్మీర్‌ పోలీస్‌ అధికారి భార్య భావోద్వేగ లేఖ

కశ్మీర్‌లో తమ కుటుంబ సభ్యులను అరెస్ట్‌ చేశారన్న ఆగ్రహంతో రాష్ట్ర పోలీస్‌ అధికారుల కుటుంబీకులు 11 మందిని హిజ్బుల్‌ ఉగ్రవాదుల కిడ్నాప్‌ చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీస్‌ అధికారుల కుటుంబాలు పడుతున్న మానసిక క్షోభ, కశ్మీర్‌లోయలో పరిస్థితులపై ఓ పోలీస్‌ అధికారి భార్య, ఉద్యోగిని అయిన ఆరీఫా తౌసిఫ్‌ ఓ స్థానిక వార్తాపత్రికకు భావోద్వేగ లేఖ రాశారు.  

శారీరకంగా పక్కనున్నా మానసికంగా విధుల్లోనే
‘ఒంటరిగా ఇంట్లో నిద్రపోవడమన్నది పెద్ద సమస్యేం కాదు. కానీ అర్ధరాత్రి భయంతో ఉలిక్కిపడి లేచిన సందర్భాల్లో పక్కనుండి ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు ఎవ్వరూ లేకపోవడంతో మానసిక క్షోభను అనుభవిస్తాం. అంతేకాదు భర్తతో కలసి ఈ రోజు లేదా రేపు లేదా ఎల్లుండి బయటకు వెళ్లాలనుకుని మేం అనుకుంటే అవి ఎప్పుడోకాని జరగవు. అదృష్టంకొద్దీ అది జరిగినా పోలీస్‌ అధికారులు శారీరకంగా మాత్రమే కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉంటారు. కానీ మానసికంగా, ఫోన్‌ ద్వారా వాళ్లు అప్పుడు కూడా విధుల్లోనే ఉంటారు. కశ్మీర్‌లో ఆపరేషన్ల సందర్భంగా ఎక్కడ, ఏ పోలీస్‌ అధికారి చనిపోయినా మేమంతా తీవ్రమైన భయం, అభద్రతాభావంలోకి జారిపోతున్నాం’

బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది
కశ్మీర్‌లో పరిస్థితులపై స్పందిస్తూ.. ‘ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకనే కశ్మీర్‌లో యువకులు పోలీస్‌శాఖలో చేరుతున్నారు. వారు చదివింది ఒకటి. చేసేది మరోటి. దేశంలో కశ్మీర్‌లో మాత్రమే రిటైర్డ్‌ అధికారులు డిప్యూటీ సూపరింటెండెంట్‌(డీఎస్పీ)లుగా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో డిగ్రీచేసిన వారు ప్రభుత్వ అధికారులుగా చేస్తున్నారు. కొన్నిసార్లు ఇంటినుంచి బయటికెళ్లాలంటే భయమేస్తోంది. భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో పెల్లెట్లు తగలడంతో నష్టపోయినవారు, ఇతరులు ఆ దురదృష్టకర ఘటనకు మేమే బాధ్యులం అన్నట్లు చూస్తారు. ఏదైనా పోలీస్‌ అధికారికి ప్రమాదం జరిగితే కనీసం మా పట్ల సానుభూతి చూపేవారు ఒక్కరు కూడా ఉండటం లేదు. ఈ విషయాలను నా పిల్లలు చిన్నతనంలోనే అర్ధం చేసుకున్నారు. ప్రస్తుతం నా రాష్ట్రంపై కమ్ముకున్న కారు చీకట్లు తొలగిపోయి సుసంపన్నమైన, శాంతియుత కశ్మీర్‌ను చూడాలని నేను కోరుకుంటున్నా’ అంటూ తన భావోద్వేగ లేఖను ముగించారు.

చిన్నచిన్న కోరికలూ సుదూర స్వప్నాలే..
‘భర్తతో సరదాగా షికారు, కష్టసుఖాల్లో కలసిఉండటం వంటి చిన్నచిన్న కోరికలు సైతం పోలీస్‌ అధికారుల భార్యలకు సుదూర స్వప్నాలే. రాత్రి  భర్త ఇంటికొస్తే కుటుంబమంతా కలసి భోంచేద్దామని ఎదురుచూస్తాం. కుటుంబంలో వేడుకలు, అంత్యక్రియలకు కలసి వెళ్లాలనుకుంటాం. పిల్లలతో కలసి షికారుకు వెళ్లాలనుకుంటా. కానీ వీటిలో ఏవీ నెరవేరవు. మా పిల్లలను ఒంటరిగా పెంచుతాం. మేం పచ్చి అబద్దాలకోరులం. మాలో చాలా మంది ‘నాన్న శనివారం ఇంటికొస్తారు’ ‘నాన్న పేరెంట్‌ మీటింగ్‌కు కచ్చితంగా వస్తారు’ ‘మనం ఈవారం నాన్నతో కలసి పిక్నిక్‌కు పోదాం’, ‘పండుగకు నాన్న ఇంటికొస్తానన్నారు’ అంటూ మా పిల్లలకు అబద్ధాలు చెబుతూనే ఉంటాం. అనారోగ్యంతో బాధపడే మా అత్తమామలకు ‘మీ అబ్బాయి ఫలానా రోజు వస్తానన్నారు’ అంటూ అబద్ధాలు చెబుతాం. ఇలా అబద్ధాలు చెబుతూ మమ్మల్ని మేమే మోసం చేసుకుంటున్నాం’

మరిన్ని వార్తలు