తీహార్‌ జైలుకు జేకేఎల్‌ఎఫ్‌ చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌

10 Apr, 2019 08:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్‌ఎఫ్‌) చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ను జమ్మూ కోట్‌ బల్వాల్‌ జైలు నుంచి ఢిల్లీలోని తీహార్‌ జైలుకు ఎన్‌ఐఏ తరలించింది. మాలిక్‌ను గురువారం ఎన్‌ఐఏ కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద జేకేఎల్‌ఎఫ్‌ను నిషేధించిన నేపథ్యంలో యాసిన్‌ మాలిక్‌ను అరెస్ట్‌ చేశారు.

ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా వేర్పాటువాద సంస్ధ జేకేఎల్‌ఎఫ్‌ను నిషేధించారని హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా వెల్లడించారు. కశ్మీరీ పండిట్ల ఊచకోతకు మాలిక్‌ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని, జమ్ము కశ్మీర్‌లో నలుగురు ఐఏఎఫ్‌ అధికారుల హత్యలోనూ జేకేఎల్‌ఎఫ్‌ హస్తం ఉందని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులకు మాలిక్‌ నేతృత్వంలోని జేకేఎల్‌ఎఫ్‌ నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు.

మరిన్ని వార్తలు