'అసలు ఈతరం పిల్లలకు ఏమైంది?'

15 Feb, 2016 18:39 IST|Sakshi
'అసలు ఈతరం పిల్లలకు ఏమైంది?'

మీరట్: జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో జరుగుతున్న ఘటనలు దేశ ద్రోహ చర్యలని, పాకిస్థాన్కు, అఫ్జల్ గురూకు మద్దతుగా నినాదాలు చేసిన వారిపై దేశద్రోహ కేసులు నమోదు చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే డిమాండ్ చేశారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మీరట్లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన దేవాలయంలాంటి విద్యాలయంలో విద్య నేర్చుకుంటూ ఈ తరం పిల్లలు దేశానికి విరుద్ధమైన నినాదాలు ఎలా చేస్తున్నారా అని తామంతా ఆశ్చర్యపోతున్నామని అన్నారు.

జేఎన్యూ ఆందోళనల వెనుక పాకిస్థాన్ ఉగ్రవాది లష్కరే తోయిబా అధ్యక్షుడు హఫీజ్ సయీద్ హస్తం ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ధుమారం రేగిన నేపథ్యంలో దత్తాత్రేయ మాట్లాడుతూ  దేశంలో అత్యవసర పాలన విధించి దేశం మొత్తాన్ని జైలులో బంధించిన కాంగ్రెస్ పార్టీ నేడు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. దేశానికి ఎదురవుతున్న సమస్యలను సవాలు తీసుకుని సేవ చేసేందుకు అంతా సిద్ధంగా ఉండాలని స్వయం సేవక్ లకు చెప్పారు. హిందూ అంటే మతం కాదని ఒక జీవన విధానం అని అన్నారు. ప్రపంచమంతా సామరస్యం వెల్లివిరియాలని వసుదైక కుటుంబంగా మారాలని ఆకాక్షించారు.

మరిన్ని వార్తలు